Old City Metro
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Metro: ఓల్డ్ సిటీ మెట్రో పనులు ఎక్కడ వరకు వచ్చాయంటే?

Metro:

ఓల్డ్ సిటీ మెట్రో పనులు వేగవంతం
ప్రభావిత ఆస్తుల సంఖ్య కుదింపు
పిల్లర్ల మార్కింగ్ పనులు మొదలు 
త్వరలో భూసామర్ధ్య పరీక్షలు
పరీక్షల నిర్వహణకు ఏజెన్సీ నియామకం
రోజువారీగా సమీక్షిస్తున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: గౌలిగూడ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట మధ్య మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన రోడ్ విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో అలైన్‌మెంట్ అద్భుతంగా ఉండేలా చర్యలు చేపట్టామని, ఈ మార్గంలో రోడ్డు విస్తరణతో ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశామని హెచ్ఏఎంఎల్ ఎండీ డాక్టర్ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో పనులకు సంబంధించి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి పాతబస్తీ వాసులకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆయన ఆదివారం వెల్లడించారు. ఇదివరకే రూపొందించిన అంచనాల ప్రకారం 1,100 ఆస్తులు ఈ విస్తరణలో కూల్చివేయాల్సి ఉందని నిర్ధారించగా, ఎలైన్‌మెంట్‌ను ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వినియోగించి సరిదిద్దటంతో ప్రభావిత ఆస్తుల సంఖ్య 900 వరకు తగ్గిందని ఆయన వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించి అవార్డులు జరీ చేశామని, 380 ఆస్తుల కూల్చివేతలు ఇప్పటివరకు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. వీటి కోసం రూ. 360 కోట్ల నష్టపరిహారం ప్రభావిత ఆస్తుల వారికి చెల్లించామని ఎండీ వివరించారు.

వ్యర్థాల తొలగింపులో సవాళ్లు
ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ, కూల్చివేతలు చేపట్టి నిర్మాణ వ్యర్థాలను తొలగించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఇళ్లు ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండటంతో పాటు ప్రతి కట్టడానికి సంక్లిష్టమైన విద్యుత్ లైన్లు, ఇతర కేబుళ్లు వేలాడుతూ ఉన్నాయని, దీంతో చాలా అప్రమత్తంగా వాటిని తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సాధారణ జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్ధరాత్రి సమయాల్లో విస్తరణ పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగిలిన ఆస్తుల స్వాధీనానికి, త్వరితగతిన కూల్చివేతలు పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. దీంతో పాటు మెట్రో కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా చర్యలు చేపట్టామని మెట్రో ఎండీ తెలిపారు. ఈ కారిడార్‌లో వచ్చే పిల్లర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి వాటిని మార్కింగ్ చేసే పని ప్రారంభించామని స్పష్టం చేశారు. వయాడక్ట్‌ను నిలిపే పిల్లర్ల మధ్య 25 మీటర్ల (సుమారు 82 అడుగులు) దూరం ఉంటుందని, మెట్రో స్తంభాలు, స్టేషన్లు వచ్చే చోట భూసామర్థ్య పరీక్షల కోసం ఏజెన్సీని నియమించామని, త్వరలో భూసామర్థ్య పరీక్షలు కూడా చేపడతామని ఆయన వెల్లడించారు.

Read Also- Siraj: ఐదో టెస్టులో చారిత్రాత్మక రికార్డు సాధించిన మహ్మద్ సిరాజ్

చారిత్రక, ఇతర సున్నిత కట్టడాల వద్ద అంతరాయం ఏర్పడకుండా పిల్లర్ , మెట్రో స్టేషన్ల స్థానం నిర్ణయించేందుకు డీజీపీఎస్ సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. నిర్మాణ సమయంలో సర్వే సులభంగా జరిగేలా భూమిపై తాత్కాలిక బెంచ్ మార్క్ లొకేషన్లు నిర్ణయించినట్టు ఆయన స్పష్టం చేశారు. పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూగర్భ మరుగునీటి లైన్లు, మంచినీటి లైన్లు, వరదనీటి డ్రైన్లు, పైన వేలాడే విద్యుత్ లైన్లు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ లేబుళ్లు గా మారుస్తామని తెలిపారు. ఇందుకోసం వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్ విభాగాల నుండి వచ్చే కొద్ది రోజుల్లో అంచనాలు సమర్పించవలసిందిగా కోరామని వివరించారు. ఆయా శాఖల అధికారులతో మెట్రో అధికారులు అహర్నిశలు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ముఖ్యమైన యుటిలిటీస్ ని గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు.

Read Also- Parents: పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులది.. మరి పిల్లల ఆలోచనా విధానం ఎలా ఉందంటే?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్