Telangana CM visited Tirumala Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం మంగళవారం సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల వెళ్లారు. శ్రీ పద్మావతి నగర్‌లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాత్రి అక్కడ బస చేసిన సీఎం, బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని, కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ముందుగా, ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చూసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి ఆలయ పండితులు వేదాశీర్వచనాలను అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Also Read: రేవంత్ టీమ్ రెడీ
ఆలయం నుంచి బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సత్సంబంధాలతో ఒకరికి ఒకరు సహాయసహకారాలు అందిపుచ్చుకోవాలని కోరారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవ్వగానే చర్చలు జరిపి సత్రం, కల్యాణ మండపం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్నిరకాలుగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు సీఎం.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.