Hyderabad Police: సైబర్ మోసాలకు పాల్పడుతుండటంతోపాటు ఉద్యోగాల పేర యువకులను మోసగిస్తూ వారిని విదేశాల్లో ఉంటున్న సైబర్ క్రిమినల్స్ వద్దకు పంపిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం యూనిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) పీ.విశ్వప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం ఫోన్ చేసిన మహిళ తన పేరు నేహా అని పరిచయం చేసుకుంది. కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్పింది. ఆ తరువాత పలుమార్లు ఫోన్లో మాట్లాడటంతోపాటు వాట్సాప్ చాటింగ్ చేస్తూ బాధితునితో స్నేహం పెంచుకుంది. ఈ క్రమంలో లాభాలు వస్తాయంటూ బాధితునితో లక్షా 70వేల రూపాయలను క్యాటలిస్ట్ మార్కెట్స్ ఎఫ్ఎక్స్ డాట్ కామ్ ద్వారా పెట్టుబడులుగా పెట్టించింది.
Also Read: Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు
దీనిపై 20,100 అమెరికన్ డాలర్ల లాభం వచ్చినట్టుగా చెప్పింది. డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే టాక్స్ కట్టాలని చెప్పి 4.82లక్షల రూపాయలను తాను చెప్పిన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ఆ తరువాత మరోసారి 1.42లక్షల రూపాయలను బదిలీ చేయించింది. మూడోసారి 75వేల రూపాయలన ట్రాన్స్ ఫర్ చేయించుకున్న నేహా డబ్బు మొత్తం విత్ డ్రా చేసుకోవాలంటే మరో 3,326 అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం యూనిట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ సీతారాములు కేసులు నమోదు చేసి ఎస్ఐ శ్రీకాంత్ తోపాటు కానిస్టేబుళ్లు అబ్సార్, పవన్, వినయ్ కుమార్ లతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారాసిగూడ బౌద్దనగర్ నివాసి చిక్కల సంతోష్ కుమార్ (31) కేసులో ప్రధాన సూత్రధారి అని నిర్ధారించుకుని అతన్ని అరెస్ట్ చేశారు.
Also Read: Gold Rates (01-08-2025): బంగారం కొనాలంటే కోనేయండి ఇప్పుడే.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
ఉద్యోగాల పేర..
దర్యాప్తులో సంతోష్ కుమార్ గతంలో కొన్నాళ్లపాటు ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలతో ఓ కన్సల్టెన్సీని ప్రారంభించి దుబాయ్, సింగపూర్ తదితర దేశాలకు కూడా వెళ్లినట్టు తేలింది. ఆ సమయంలోనే దుబాయ్, సింగపూర్ లలోని కొందరు కాంట్రాక్టర్లతో పరిచయాలు పెంచుకున్నట్టుగా తెలిసింది. వీరి వద్దకు యువకులను ఉద్యోగాల కోసం పంపిస్తూ కమీషన్లుగా భారీ మొత్తాల్లో డబ్బు తీసుకున్నట్టుగా తేలింది. ముగ్గురు యువకులను కాంబోడియా దేశానికి కూడా పంపినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో సంతోష్ కుమార్ కు చైనా దేశానికి చెందిన టోటో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కొందరు సైబర్ క్రిమినల్స్ కు సంతోష్ కుమార్ తన బ్యాంక్ ఖాతాను కమీషన్లు తీసుకుని ఇచ్చినట్టుగా వెల్లడైంది. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ కు చెందిన పాస్ వర్డులను కాంబోడియాలో ఉంటూ మోసాలు చేస్తున్న వారికి అందించినట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు కొంతమంది యువకులను ఉద్యోగాల పేర సైబర్ క్రిమినల్స్ వద్దకు పంపించినట్టుగా కూడా తేలింది. సైబర్ క్రిమినల్స్ ఈ యువకులతో సైబర్ నేరాలు చేయించినట్టుగా వెల్లడైంది. నిందితుని నుంచి 24 డెబిట్ కార్డులు, 5పాస్ బుక్కులు, 7చెక్ బుక్కులు, 1ల్యాప్ టాప్, 3 షెల్ కంపెనీల స్టాంపులు, 15మొబైల్ ఫోన్లు, రెండు ట్యాబ్ లు, హైటెక్ టీవీ ఛానల్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.