Balakrishna: శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ 2023 (National Film Awards 2023)లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మరీ ముఖ్యంగా ‘బనావో బేటీకో షేర్’ కాన్సెప్ట్‌తో వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాకు అవార్డు రావడం పట్ల తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ గుర్తించి, ఈ సినిమాను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి చిత్రయూనిట్ కూడా ధన్యవాదాలు తెలిపింది. తన సినిమా బెస్ట్ చిత్రంగా ఎంపిక కావడంపై నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా ఫేస్‌బుక్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Also Read- Uttarakhand Tragedy: దేశంలో ఘోరం.. బాలుడ్ని పొట్టనపెట్టుకున్న 5 ఆస్పత్రులు.. రంగంలోకి సీఎం!
‘‘71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది. షైన్ స్క్రీన్స్ (India) LLP తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి , హరీష్ పెద్ది.. ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది. జై హింద్’’ అని నందమూరి బాలకృష్ణ (NBK) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read- National Film Awards 71: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు సినిమాలివే..
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సంతోషం వ్యక్తం చేస్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. ఇందులో.. ‘‘భగవంత్ కేసరి చిత్రం.. నా కెరీర్‌లో చేసిన విభిన్నమైన ప్రయత్నం. నేను నమ్మినట్టుగానే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ జాతీయ పురస్కారం బోనస్ అని భావిస్తున్నాను. మా ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్‌తోనే ‘బనావో బేటీకో షేర్’ అనే కాన్సెప్ట్‌ని చెప్పగలిగాం. అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ వంటి స్టార్ హీరో నటనతో ప్రస్తావించగలిగాం. సినిమా సక్సెస్‌తో పాటు ఇలాంటి గుర్తింపు కూడా దక్కితే క్రియేటర్స్‌కు ఇంకాస్త కిక్ వస్తుంది. అది మరిన్ని మంచి చిత్రాలు చేసేందుకు స్ఫూర్తినిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. చిత్ర నిర్మాతలు కూడా ఈ పురస్కారం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు