AV Ranganath Hydraa: బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) ఏవీ రంగనాథ్ శుక్రవారం సందర్శించారు. సున్నం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మురుగు నీటి కాలువల డైవర్షన్ పనులను పరిశీలించారు. వరద నీరు సున్నం చెరువులో కలిసేలా మురుగు నీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని, నాలాల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని సూచించారు. అల్లాపూర్, బోరబండ డివిజన్లు కలుపుతూ ప్రవహించే నాలాలను విస్తరించాలని సూచించారు. పద్మావతి నగర్ వద్ద నాలాను ఆక్రమించి ఇటీవల నిర్మించిన షెడ్డులను తొలగించాలని స్థానికులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. బోరబండ మీదుగా హైటెన్షన్ కరెంటు తీగల రోడ్డులో ఆక్రమణలు రావడాన్ని కమిషనర్‌కు చూపించారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి, రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు. నాలాలు, రహదారుల విస్తరణతో పాటు సున్నం చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే ఇక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని కమిషనర్ తెలిపారు. సున్నం చెరువు పునరుద్ధరణ పనులను బోరబండ, అల్లాపూర్ కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, సబీహా బేగం స్వాగతించారు. నాలాలను కూడా త్వరితగతిన వెడల్పు చేయాలని కోరారు. సున్నం చెరువు పై భాగంలో కూడా రోడ్డు వస్తే అయ్యప్ప సొసైటీ రోడ్డులోని వంద అడుగుల రహదారికి సులభంగా చేరుకోవచ్చునని స్థానికులు వివరించారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని కమిషనర్ చెప్పారు. సున్నం చెరువును అభివృద్ధి చేస్తున్న హైడ్రా కమిషనర్‌ను ఈ సందర్భంగా కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, సబీహా బేగం సన్మానించారు.
Also Read- Bun Butter Jam: అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. టీజర్ అదిరింది!
ఎన్జీఓ కాలనీలో చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
గచ్చిబౌలిలోని ఎన్జీఓ కాలనీలోని మూసాయికుంట, గోసాయికుంటలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. రికార్డులను పరిశీలించి ఈ రెండు చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. తర్వాత వనస్థలిపురం ప్రాంతంలోని చింతలకుంట పరిసరాలను పరిశీలించారు. వనస్థలిపురం నుంచి వచ్చే వరద నిలవకుండా చింతలకుంట వద్ద జాతీయ రహదారి కింద నుంచి నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. 70 శాతం పనులు పూర్తయినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇక్కడ గతంలో చిన్న లైన్ ఉండేదని, అది సరిపోకపోవడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 3 కిలోమీటర్ల పరిధిలో వరద నీరు నిలిచేదని స్థానికులు తెలిపారు. అనంతరం మన్సూరాబాద్ లోని వివేకానందనగర్‌లో రోడ్ల కబ్జాలు పరిశీలించారు. గ్రామపంచాయతీ లేఔట్ ప్రకారం ఉండాల్సిన రహదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
Also Read- Lung Cancer: ధూమపానం అలవాటు లేనివారికి అలర్ట్.. నిర్లక్ష్యం చేయకండి
కబ్జాల నుంచి మీర్ పేట నాలాకు విముక్తి
బడంగ్ పేట ప్రధాన రహదారిని దాటుకుంటూ మీర్ పేట పెద్దచెరువుకు వెళ్ళే నాలా విస్తరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. గతంలో ఈ నాలాను ఆక్రమించి కట్టిన పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ నిర్వాహకులతోనే హైడ్రా విస్తరణ పనులు చేయించింది. 4 మీటర్ల వెడల్పు నాలాతో పాటు ఇరువైపులా 2 మీటర్ల చొప్పున బఫర్ ఉండేలా నిర్మాణం జరగాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం బండ్లగూడ, జల్ పల్లి పరిసరాల్లో ఉన్న పెద్దచెరువు, హుందాసాగర్ చెరువులను పరిశీలించారు. ఈ రెండు చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని సూచించారు. కబ్జాలు జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డ్రోన్‌తో మొత్తం చెరువు స్వరూపాన్ని చిత్రీకరించాలన్నారు. గ్రామ రికార్డులు, ఎన్ ఆర్ ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా చెరువుల ఎఫ్ టీఎల్ నిర్ధారిస్తామని రంగనాధ్ చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు