KCR Meetings: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది. అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఫాంహౌస్, నందినగర్ ఇంటికే పరిమితం కావడంతో కేటీఆర్, హరీశ్ రావు ఎంత ప్రయత్నించినా పార్టీకి మైలేజ్, క్యాడర్‌లో ఉత్సాహం రావడం లేదు. అటు కవిత చూస్తే సపరేట్ రూటులో వెళ్తూ కంటిలో నలుసుగా మారారు. ఇలాంటి సమయంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక రెడీ కావడం, అందులో ఏముందో సస్పెన్స్ కొనసాగుతుండడం, కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండడం, ఇలా అన్నీ రకరకాల చర్చలకు దారి తీశాయి.
కాళేశ్వరం నివేదికపై సస్పెన్స్
కాళేశ్వరం అవకతవకలను తేల్చేందుకు ఏర్పాటైన కమిషన్ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. 650 పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లలో ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాకు కమిషన్ చైర్మన్ పీసీ చంద్రఘోష్ అందజేశారు. దాదాపు 16 నెలలపాటు అనేక అంశాలను పరిశీలించి, 119 మందిని విచారించి కమిషన్ ఈ నివేదికను తయారు చేసింది. ప్రభుత్వానికి నివేదిక అందిన నేపథ్యంలో అందులో ఏముందో ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అంశాలను క్రోడీకరించి కమిషన్ ఈ నివేదిక తయారు చేసినట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దలకు ఉచ్చు బిగుసుకుంటుందనే చర్చ జరుగుతున్నది. ప్రాజెక్ట్ అనుకున్న దానికి అంచనాలు పెరగడం వెనుక కమీషన్ల వ్యవహారాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిషన్ రిపోర్ట్, తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
కేసీఆర్ వరుస సమావేశాలు
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కేటీఆర్ కూడా రెండు రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ప్రాజెక్ట్‌లో లోపాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఉంటే ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎదర్కోవాలి అనే అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. మొదటి రోజు పలు అంశాలతోపాటు కాళేశ్వరంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. 10 గంటల సుదీర్ఘ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అనే దానిపై సమాలోచన చేసిన కేసీఆర్, ప్రాజెక్ట్ వల్ల ప్రస్తుతం కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. శుక్రవారం కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ఉంటుందని సమాచారం.
Read Also- Kingdom First Day Collection: ‘కింగ్డమ్’ మొదటి రోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్లోనే రికార్డ్
కవిత దూకుడుకు బ్రేక్ వేసేలా..
బీసీ రిజర్వేషన్ల అంశంలో మొదటి నుంచి కవిత నత వాదనను వినిపిస్తున్నారు. అయితే, పేరుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ, జాగృతిని యాక్టివ్ చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తుండడం బీఆర్ఎస్ పెద్దలకు రుచించడం లేదు. పైకి చెప్పకపోయినా కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్యం పోరు నడుస్తున్నది, వారికి సర్దిచెప్పలేక కేసీఆర్ సతమతం అవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం అమలు చేస్తామని ఈ మధ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో తమ వల్లే ఇది సాధ్యమైందని కవిత జాగృతిని హైలైట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ఈ నెలలో కరీంనగర్‌లో బీసీ సభ నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అంతేకాదు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రపతిని కలవనున్నారు. పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ వీటిపై చర్చించారు.
లోకల్ ఫైట్‌కు సన్నద్ధం.. కానీ..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఘోరంగా విఫలమైంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో సత్తా చాటాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే బీసీ వర్గాల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. బీసీ రిజర్లేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్లస్ పాయింట్‌గా మారన నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలను సన్నద్ధం చేసేందుకు చూస్తున్నారు. అయితే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లోకల్ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అందడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది.
Read Also- Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల యుద్ధం.. భారత్ సహా ఏ దేశంపై ప్రభావం ఎంత?