Uttam kumar reddy: రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పేర్కొన్నారు. వందల కోట్లు విలువ చేసే భూములు కబ్జాకు గురయ్యాయని, ఇక ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ద ప్రాతి పదికన స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణలో భాగంగా గురువారం సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: Kaleshwaram Inquiry Report: ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రధానంగా హైదరాబాద్(Hyderabad)లోని గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న గండిపేట సమీపంలోని హిమాయత్ సాగర్, (Himayat Sagar)కిస్మత్‌పురలతో పాటు రాజేంద్రనగర్(Rajendranagar)పరిధిలోని వాలంతరి, టిజిఇఆర్ఎల్‌కు చెందిన 426-30 ఎకరాలకు గాను 131-31 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు. అందులో ఐటిఐఆర్ ఆధీనంలో ఉన్న 81.26 ఎకరాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. 50.13 ఎకరాలు ఆక్రమణకు గురైందని తెలిపారు. ఈ ఆక్రమణలపై జిల్లా కోర్టులో 20 కేసులు పెండింగ్‌లో ఉండగా హైకోర్టులో మరో 2 కేసులు నడుస్తున్నాయన్నారు. భూములను పరిరక్షించడంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డా ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక సీనియర్ న్యాయవాదిని నియమించనున్నట్లు వెల్లడించారు.
ఇలా చెక్ పెట్టండి..
భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ హైడ్రా, (Hydra)రెవెన్యూ, ఆర్అండ్ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలని శాఖాధికారులకు సూచించారు. నీటిపారుదల క్వార్టర్స్‌లో అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తొలగించడంతో పాటు తక్షణమే వాటి సమగ్ర సమాచారం తన ముందుంచాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌కు చెందిన అంగుళం భూమి కబ్జా అయినా స్వాధీనం చేసుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
భవిష్యత్‌లోనూ ఆక్రమణలకు చోటు లేకుండా పరిపాలనా పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా ఆక్రమణలకు చెక్ పెట్టొచ్చని ఉత్తమ్ సూచించారు. దీనికితోడు రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల కాలువల పక్కన ఉన్న భూముల్లో, ప్రాజెక్టులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్ అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఇ.ఎన్.సీ(అడ్మిన్) రమేష్ బాబు, వాలంతరి డైరెక్టర్ జనరల్ అనిత, హైడ్రా(Hydra)ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sheep Distribution Scam: రూ.700 కోట్ల అవినీతిపై కళ్యాణ్‌ను ప్రశ్నించిన అధికారులు