TSIIC: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల భూములు తీసుకొని తక్కువ నష్టపరిహారం అందజేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచుతామని అప్పట్లో చెప్పి, ఇప్పుడు అధికార పార్టీ నేతలు సహకరించడం లేదని అవుసులోని పల్లి, నగరం తాండ, రామక్క పేట టీఎస్ఐఐసీ భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం పంట సాగు చేసుకున్న తర్వాత భూములు వీడాలని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆనాడు ఏం చెప్పారు?
హామీలు పూర్తిగా అమలు కాలేదని అప్పటివరకు తమ భూములను సాగు చేసుకుని జీవనోపాధి సమకూర్చుకుంటామని రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వర్గల్ రహదారిపై అవుసులోని పల్లి వద్ద భూ బాధితులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి వీరికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, స్థానిక నాయకులు కొందరు వచ్చి టీఎస్ఐఐసీ భూసేకరణ రైతులకు పరిహారం తక్కువ ఇస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.50 లక్షలు ఇస్తామని ఆనాడు అన్నట్లు గుర్తు చేశారు. పలువురు ప్రతిపక్ష నాయకులు స్థానికంగా టెంటు వేసి రైతులతో పాటు నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
Read Also- US Tariff: అమెరికా టారీఫ్‌పై కేంద్రం కీలక ప్రకటన
హామీల అమలు ఏది?
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఆనాడే మంజూరు చేసిన ఇంటి స్థలాలను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులకు కంపెనీల నుండి డబ్బు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బ్రోకర్లు డబ్బును కాజేస్తున్నట్లు ఆరోపించారు. రైతులు పంటలను సాగు చేశారని ఇప్పుడు సాగునీరు అందించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే పంట పొలాలు ఎండిపోతాయని పేద రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు కల్పించుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కారం
మరోవైపు, టీఎస్ఐఐసీ జెడ్‌ఎం అనురాధ ఫోన్ ద్వారా మాట్లాడుతూ, తాను సమస్య పరిష్కారం కోసం తగన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపినట్లు రైతులు చెప్పారు. ఇంకా ఈ ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Also- Deva Katta: ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం.. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది