NIMS:
వరుస ఉదంతాలపై ప్రభుత్వం సీరియస్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నిమ్స్ ఆస్పత్రి (NIMS Hospital) ప్రతిష్టను దిగజార్చేలా వరుసగా వెలుగు చూస్తున్న ఉదంతాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. హాస్పిటల్‌లో అసలేం జరుగుతోందో తెలుసుకోవటానికి నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్టు సమాచారం. నివేదిక అందిన తరువాత అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరింటెండెట్‌గా పని చేస్తున్న డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆస్పత్రిలో ఆయన తన ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
Read Also- HYD News: హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్.. కేవలం 5 రూపాయలకే..
డాక్టర్ లక్ష్మీభాస్కర్.. తన ప్రమేయం లేకుండా ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వనివ్వబోరని హాస్పిటల్ వర్గాలే చెబుతున్నాయి. దాంతోపాటు తన మనుషులు కొందరికి మాత్రమే కాంట్రాక్ట్ పద్దతిపై ఉద్యోగాలు ఇప్పించి వారి ద్వారా కోట్ల రూపాయల్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక, ఏప్రిల్ నెలలో హాస్పిటల్ ట్రామా కేర్ భవనం 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్న ఆరోగ్య శ్రీ గదిలో పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వ చేసి ఉన్నట్టుగా అప్పట్లో వీడియోలు బయటపడ్డాయి. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆ తరువాత గదిలోని బాణాసంచాతో పాటు అక్కడ ఉన్న పెద్ద పెద్ద సూట్ కేసులు కూడా మాయమయ్యాయి. అయితే, బాణాసంచాను అక్కడికి తెచ్చి పెట్టింది ఎవరన్న దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ పంజగుట్ట పోలీసులు విచారణను నిలిపివేశారు.
Read Also- Tariff on India: భారత్‌పై ట్రంప్ ‘టారిఫ్ బాంబ్’.. సంచలన ప్రకటన
వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తూ అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో సీసీ కెమెరాలు లేవని నివేదిక ఇచ్చారు. దాంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఆస్పత్రిలో అవసరమైన అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, ఈ బాణాసంచాను తెచ్చి పెట్టిన అదనపు మెడికల్ సూపరింటెండెంట్ స్థాయి అధికారే తన పలుకుబడిని ఉపయోగించి కేసులో విచారణ ముందుకు సాగకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక, నిమ్స్ ఆస్పత్రిలో క్యాంటిన్ కేటాయింపులు, మెడికల్ షాపు నిర్వహణ, పార్కింగ్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో కూడా భారీగా అవకతకలు జరిగినట్టుగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. ఈ అంశాని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అసలు నిమ్స్ ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆయన నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన సిబ్బంది వచ్చిన ఆరోపణలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే నిమ్స్ పరిపాలనా విభాగంలో భారీ మార్పులు జరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. హాస్పిటల్‌లో ఉన్న ముఖ్య అధికారిని కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.