Sithara Entertainments: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఈ బ్యానర్‌కి పరిచయం అక్కరలేదు. ఇప్పటి వరకు 35 సినిమాలు ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటే.. అందులో సక్సెస్ సాధించినవే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాత సంస్థగా, స్టార్ హీరోలతో పాటు.. మీడియం, చిన్న రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న బిజీ బ్యానర్ ఇది. సినిమా వెంట సినిమా ప్రకటిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న ఈ బ్యానర్ నుంచి తాజాగా మరో ఊహించని హీరోతో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అది అలాంటి ఇలాంటి ప్రకటన కాదు. వింటే అంతా వావ్ అనాల్సిందే. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో, ఊహించని కాంబోలతో సినిమాలు సెట్ చేస్తున్న ఈ బ్యానర్ నిర్మాతలు తాజాగా మరో అద్భుతమైన కాంబోలో సినిమాను ప్రకటించారు. ఆ వివరాలలోకి వెళితే..
Also Read- Priya Sachdev: 30,000 కోట్ల ఆస్తి వివాదం.. ఇన్‌స్టాగ్రామ్ పేరు, బయోను మార్చిన సంజయ్ కపూర్ భార్య
‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర హీరో, బహుముఖ ప్రజ్ఞాశాలి, డివైన్ స్టార్ రిషబ్ శెట్టి (Divine star Rishab Shetty)తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ భారీ చిత్రాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2’ (Kantara 2) చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్ శెట్టి, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితార బ్యానర్‌తో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. మంచి కథకుడిగా పేరు గాంచిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన స్టోరీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని మేకర్స్ ఈ ప్రకటనలో తెలియజేశారు.
తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకునే ఈ చిత్రం.. ఈ రెండు భాషల్లోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 36గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. కేవలం అనౌన్స్‌మెంట్‌తోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై.. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు తెలియజేస్తామని తెలిపారు.
రిషబ్ శెట్టి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘కాంతార చాప్టర్ 1’తో పాటు ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు