Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సంచలనమైన కామెంట్లు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పక్కా లోకల్ క్యాండిడెట్‌నే రంగంలోకి దింపనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అభ్యర్థి ఎవరైనా ఐక్యంగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఫలితమే రిపీట్ కానున్నట్లు ఆయన వెల్లడించారు.
బలమైన అభ్యర్థి కోసం క్షేత్ర స్థాయిలో సర్వే చేయిస్తున్నట్లు, టికెట్ అభ్యర్థిస్తున్న నేతల్లో కొందరు లోకల్ లీడర్లకు సానుకూలమైన మార్కులు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాడర్ కూడా లోకల్ లీడర్‌కు అవకాశమిస్తే గెలిపించుకుంటామని చెబుతుండటంతో వారి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఉండనున్నట్లు ఆయన వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు.
Also Read: Talasani Srinivas Yadav: పారదర్శకత లేకుండా కులగణన.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!
లోకల్ అభ్యర్థి వైపు.. క్యాడర్ చూపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టికెట్ కోసం స్థానికేతరులైన లీడర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుండగా, ఈ సారి లోకల్ లీడర్‌కు టికెట్ కేటాయిస్తే తాము గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నామని క్యాడర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సిటీ రాజకీయాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్, గౌడ్ నేతలు కీలక పాత్ర పోషిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపైన సిటీ రాజకీయాల్లో ముఖేష్ గౌడ్, యాదవ్ కులానికి చెందిన తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ, బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
వీరిలో తలసాని శ్రీనివాసయాదవ్ నేటికీ సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, హైదరాబాద్ సిటీలోని ఒక్క నియోజకవర్గం నుంచి కూడా గౌడ్ కులానికి చెందిన నేతల ప్రాతినిధ్యం లేదు. యాదవ్ కులానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వగా, తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రేసులో స్థానిక నేత, మాజీ కార్పొరేటర్ మురళి గౌడ్ కూడా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ గౌడ్ కులానికి చెందిన మురళీ గౌడ్‌కు టికెట్ కేటాయిస్తే ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపు సులువవుతుందని లోకల్ క్యాడర్ భావిస్తున్నది.
పైగా మురళి గౌడ్ ఓ దఫా కార్పొరేటర్‌గా, ఆ తర్వాత ఆయన కుమారుడు సంజయ్ మరోసారి కార్పొరేటర్‌గా అనేక అభివృద్ది పనులు చేపట్టి, క్లాస్, మాస్ ఓటర్లతో సత్సంబంధాలున్నట్లు, ఆ సంబంధాలు ఆయన గెలుపునకు దోహదపడుతాయని భావస్తున్నట్లు సమాచారం. మిగిలిన స్థానికేతర నేతలకు టికెట్లు కేటాయిస్తే వారు కనీసం ప్రజలకు కూడా అందుబాటులో ఉండరని, మురళీ గౌడ్ అయితే నియోజకవర్గంలోనే నివాసం, వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని లోకల్ క్యాడర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, మంత్రి పొన్నం కూడా మీడియాతో మాట్లాడుతూ మురళి గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి అని సంచలన వ్యాఖ్యాల చేశారు. ఈ సంకేతాలతో ఇప్పుడు రాజకీయాల్లో వాడీవేడీ చర్చ నడుస్తున్నది.
Also Read: Thummala Nageswara Rao: ఆయిల్ పామ్‌తో రైతులకు ఆర్థిక బలం: తుమ్మల నాగేశ్వరరావు