Nushrratt Bharuccha: బాలీవుడ్ స్టార్ నటి నుస్రత్ భరుచ్చా.. హిందీ చిత్ర పరిశ్రమలోని లింగ వివక్ష గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెట్స్ లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి సినీ జర్నలిస్ట్ నయన్ దీప్ రక్షిత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరోలకు మెరుగైన సౌకర్యాలు, లగ్జరీ వానిటీ వ్యాన్ లు , శుభ్రమైన వాష్ రూమ్ లు లభిస్తాయని.. కానీ హీరోయిన్లకు అలాంటి సౌకర్యాలు దొరకవని ఆమె వ్యాఖ్యానించారు.
‘హీరో వాష్ రూమ్ వాడుకోవచ్చా’
ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని సైతం నటి నుస్రత్ భరుచ్చా పంచుకున్నారు. ‘హీరో వానిటీ వ్యాన్ లోని వాష్ రూమ్ 5 నిమిషాలు ఉపయోగించుకోవచ్చా? అతను ఇక్కడ లేడు కదా!’ అని అడిగినట్లు తెలిపారు. ఈ అనుభవం సెట్స్ లో మహిళలు ఎదుర్కొనే చిన్న చిన్న అసమానతలకు ఉదాహరణ అని నుస్రత్ చెప్పారు. అంతేకాదు సినిమా హిట్ అయిన తర్వాత హీరోలకు వెంటనే కొత్త అవకాశాలు వస్తాయని.. కానీ మహిళా నటిమణులు ఛాన్స్ ల కోసం నిరంతరం పోరాడాల్సి ఉంటుందని నుస్రత్ చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రం ‘ప్యార్ కా పంచ్‌నామా (2011)’ (Pyaar Ka Punchnama) నుంచి ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నుస్రత్ అన్నారు.
హిట్స్ వచ్చినా.. రెండేళ్లు ఖాళీ
ఒక హిట్ సినిమా తర్వాత నటీనటులు కొన్ని మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని కోరుకుంటారని నుస్రత్ అన్నారు. కానీ మహిళలకు అలాంటి ఆప్షన్ లు తక్కువగా లభిస్తాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తన జీవితంలో ఎదురైన అనుభవాలే ఉదాహరణ అని ఆమె చెప్పారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా తన ఏజెన్సీ నెక్స్ట్ సినిమాకు విడిచిపెట్టిందని.. ఫలితంగా దాదాపు రెండేళ్లు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఒంటరిగా కేఫ్ లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వరుస హిట్స్ సాధించినప్పటికీ అవకాశాలు లేకపోవడం తనను ఎంతగానో బాధించాయని నటి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Viral News: అయ్య బాబోయ్.. బైక్‌లోకి దూరిన పాము.. జస్ట్ మిస్ లేదంటే!
నుస్రత్ మూవీ ప్రాజెక్ట్స్
ఇక నుస్రత్ భరుచ్చా ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ఆమె ఇటీవల ‘ఛోరీ 2’ సినిమాలో నటించారు. అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఆమె గతంలో ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘ప్యార్ కా పంచ్‌నామా’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించారు. అయితే హిందీ పరిశ్రమపై హీరోలు అనుభవిస్తున్న సౌఖర్యాలపై నటి చేసిన కామెంట్స్ కారణంగా భవిష్యత్తులో అవకాశాల పరంగా ఆమెకు సమస్యలు ఎదురుకావొచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నెటిజన్లు ఆమె చేసిన కామెంట్స్ ను సమర్థిస్తున్నారు. సమస్యను ధైర్యంగా చెప్పుకోవడంలో తప్పేమి లేదని నటికి మద్దతు ఇస్తున్నారు.