Eatala Rajendar: ఈటల రాజేందర్ ఒక పెద్ద మోసగాడని, టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్‌తో పాటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేశాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈటల రాజేందర్ ది కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాదని, కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. ఈటలకు రాజకీయ బిక్ష పెట్టి రెండుసార్లు మంత్రిగా చేసిన కేసీఆర్‌ను విమర్శించడం అంటే “తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే” అవుతుందని వ్యాఖ్యానించారు. దేవుడు లాంటి కేసీఆర్‌ను విమర్శిస్తే “పుట్టగతులు ఉండవు” అని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న ఈటల ఆశలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. పేద ప్రజల రక్తాన్ని పీల్చి వందల ఎకరాలు కబ్జా చేస్తే దానిని సహించని కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కొడుకు, బిడ్డ పేర్ల పక్కన ‘రెడ్డి’ అని పెట్టుకున్న ఈటల బీసీ ఎలా అవుతావని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కమలాపూర్‌లో ఉన్న ఈటల బంధువులను ఏనాడైనా హైదరాబాద్‌కు తీసుకువెళ్లి కనీసం అన్నం పెట్టావా అంటూ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ బీసీ ముసుగులో ఉన్న దొర అని అన్నారు. “గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎలా ఎదిగావు?” అని ప్రశ్నించారు. “హుజురాబాద్ గడ్డ బిక్ష పెడితే షామీర్‌పేట్ గడ్డ నాది అని ఎలా అంటావు?” అని ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో నాటి టీఆర్‌ఎస్ కార్యకర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకొని ఇప్పుడు షామీర్‌పేట్‌కు వెళ్లి వాళ్లను నట్టేట ముంచారని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.