Telangana Tourism: బ్రెజిల్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వాటర్ స్పోర్ట్స్‌లో సాహస క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంగళవారం ‘పర్యాటక ప్రగతి’పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, బడ్జెట్ హోటల్స్, ఇతర పెండింగ్ పనులు, మొదటి దశలో కొత్తగా చేపట్టబోయే ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అధికారులు మంత్రికి వివరించారు.
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు..
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలున్నాయని, అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, దశలవారీగా ప్రాధాన్యతాక్రమంలో వీటిని అభివృద్ధి చేయాలన్నారు. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించాలని, ప్రైవేట్ హోటల్స్, ట్రావెల్స్‌కు దీటుగా ఆదాయం పెంచుకోవాలన్నారు. పర్యాటక శాఖ స్వయం సమృద్ధి సాధించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించి, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఇక్కడికే రప్పించేలా కృషి చేయాలని జూపల్లి పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రధాన జాతీయ రహదారుల్లో వే సైడ్ అమ్నిటీస్ కల్పనకు చర్యలు తీసుకోవాలని, సైనేజ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో షార్ట్ స్టే కోసం గ్లాపింగ్ టెంట్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!
పర్యాటక ప్రాంతాలపై ప్రచారం..
పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్‌పై ఫోకస్ చేయాలని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, కళాకారులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ‘రిజల్ట్ ఓరియంటెడ్’గా పని చేసి, ఫలితాలు సాధించాలని, నిర్దిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పైల్స్ పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని, పెండింగ్‌లో ఉన్న పైల్స్‌తో పాటు కొత్తగా వచ్చే వాటిని కూడా కంప్యూటరీకరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, ఓఎస్డీ నాగార్జున, అధికారులు ఉపేందర్ రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.