Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుకైన శిల్పకళా వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేవలం పదిహేను వందల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే వ్యాలిడ్ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కానీ కొందరు పాస్‌లు లేకుండా, వేదిక వద్దకు చేరుకుని హంగామా చేస్తుండటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు లాఠీచార్జ్‌తో ఈ ప్రీ రిలీజ్ వేడుక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ వేడుకను చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు పరీక్షిస్తున్నారు. వ్యాలిడ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. అంతేకాదు, ఒకేసారి గుంపుగా కాకుండా, ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోనికి పంపిస్తున్నారు. ఇంతకు ముందు ‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు చిన్నపిల్లలను కూడా తీసుకుని ఈ వేడుకకు రావడం గమనించవచ్చు. ఎన్ని సంఘటనలు జరిగినా, ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు బుద్ధి రావడం లేదంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Also Read- HHVM: ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్.. పోలీసులు విధించిన షరతులివే?
ఈ వేడుక వద్ద లాఠీఛార్జ్ జరగడానికి కారణం.. ఒకేసారి లోనికి వెళ్లేందుకు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడంతో చిన్నపాటి తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్ అనివార్యమైందని పోలీసులు చెబుతున్నారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, అయినా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వారు లాఠీలకు పని కల్పించక తప్పలేదని, అక్కడున్న అభిమానులు కొందరు చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రక యోధుడి పాత్రలో నటించిన ఈ ‘హరి హర వీరమల్లు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు బ్రహ్మానందం వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు కొన్ని కండీషన్స్‌తో పోలీసులు అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read- Natti Kumar: ఫిష్ వెంకట్‌కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!
అగ్ర నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమాను నిర్మించారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు