Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన బీజేపీ శ్రేణుల వర్క్ షాపులో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆయన పేర్కొన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి తమకు తేడా ఉందని బండి అన్నారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు మించి అప్పులు
బీఆర్ఎస్ పార్టీ.. గత పదేళ్లు సర్పంచ్ లను వేధించుకొని తిన్నదని కేంద్రం మంత్రి బండి సంజయ్ అన్నారు. అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదని ఆరోపించారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలే బీజేపీ ప్రచారకర్తలని బండి అన్నారు. ఆ రెండు పార్టీలకు అధికారం ఇస్తే రూ. 6 లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప చేతికి ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) ను మించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు బండి ఆరోపించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని పేర్కొన్నారు.
నీటి పంపకాల సమస్యపై
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నీటి పంపకాలపై సమస్య తలెత్తిన నేపథ్యంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోందని బండి సంజయ్ అన్నారు. తొలిసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చల కోసం కమిటీ వేసిందని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదని అన్నారు. రెండు రాష్ట్రాలు సొంత ఎజెండాతో ఢిల్లీకి వచ్చాయని.. సమస్య గంటల్లో కొలిక్కి వచ్చేది కాదు కాబట్టి కేంద్రం కమిటీ వేసి సమస్యను పరిష్కరించబోతోందని అన్నారు. అయితే కమిటీపై ఇక్కడ రేవంత్ రెడ్డి.. అక్కడ చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ఉద్యమం మొదలుపెడతామని.. ప్రగల్పాలు పలుకుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.
Also Read: Kukatpally Strange incident: కాన్పు కోసం వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి బిగ్ షాక్.. భర్తపై ఫిర్యాదు!
ఫోన్ టాపింగ్ వ్యవహారంపై
మరోవైపు ఫోన్ టాపింగ్ అంశం గురించి కూడా బండి సంజయ్ మాట్లాడారు. ఈ ఘనకార్యానికి ఒడిగట్టిన చండాలన ప్రభుత్వం కేసీఆర్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఫోన్లు టాపింగ్ చేస్తున్నట్లు అనుమానం వస్తోందని బండి అన్నారు. కేసీఆర్ హయాంలోని ఫోన్ టాపింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారో లేక వీళ్లు తెచ్చి పెట్టుకున్నారో తెలియడం లేదని అన్నారు. భార్యాభర్తల ఫోన్లు వినే చిల్లర బుద్ధులు ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఫోన్లను టాప్ చేయడమే కాకుండా వాటిని సమర్థించుకోవడం సిగ్గుచేటని బండి అన్నారు.