Kukatpally Strange incident: హైదరాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి వచ్చేసరికి.. ఆమె భర్త ఇంటిని అమ్మేశాడు. ఇది తెలియని ఆమె ఇంటికి వచ్చి తలుపుకొట్టగా వేరే వారు డోర్ ఓపెన్ చేశారు. వారిని చూసి షాకైన ఆమె మీరెవరని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఏమీ పాలుపోని భార్య.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ కూకట్ పల్లిలోని శాంతి నగర్ కు చెందిన నికితా, శ్రావణ్ భార్య భర్తలు. అయితే ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో నికితా గర్భం దాల్చగా.. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. కొద్దికాలం పాటు ఆమె అక్కడే ఉండిపోగా.. భర్త ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. కొన్ని నెలల తర్వాత తాజాగా ఆమె తన బిడ్డతో కలిసి హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లింది. తీరా ఆ ఇల్లు తన భర్త అమ్మేసినట్లు తెలుసుకొని ఖంగు తింది. భర్తకు ఫోన్ చేస్తే అతడి నుంచి స్పందన లేదని బాధితురాలు వాపోయింది.
భార్య కాన్పుకు పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు అమ్మేసిన భర్త
తమ ఇంట్లో వేరేవాళ్లు ఉండటంతో కంగుతిన్న భార్య
ఉద్యోగం చేస్తూ.. ప్రతినెల ఇంటి ఈఎంఐలు కడుతోన్న భార్య నికిత
కూకట్ పల్లి శాంతినగర్ లో ఘటన
ఇంటి ముందు బైఠాయించిన భార్య, ఆమె బంధువులు pic.twitter.com/ksXrdoN05d
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2025
నన్ను టార్చర్ చేశారు!
భర్త శ్రావణ్ పై నికితా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను తెలియజేసింది. ‘2022 ఏప్రిల్ లో ఇల్లు తీసుకున్నాం. మా తల్లిదండ్రులు ఇచ్చిన కొంత డబ్బుతోనే ఇల్లు కొన్నాం. మిగిలిన డబ్బు కోసం ఇద్దరం కలిసి లోన్ తీసుకున్నాం. ప్రతీ నెలా బ్యాంక్ ఈఎమ్ఐ (EMI) నా భర్తతో పాటు నేను చెల్లించాను’ అంటూ నికితా చెప్పుకొచ్చారు. వరకట్నం కోసం తన భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధించినట్లు చెప్పారు. అయినప్పటికీ వాటిని భరిస్తూ వచ్చానని అన్నారు. గతేడాది గర్భం దాల్చిన తర్వాత వారి వేధింపులు మరింత ఎక్కువ అయినట్లు చెప్పారు.
Also Read: Aadhar Verification: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక మీ సమస్యలు తీరినట్లే!
పాపను కనీసం చూడలేదు
డెలీవరి సమయంలో ఆస్పత్రికి వచ్చి తన భర్త శ్రావణ్ గొడవ చేసినట్లు నికిత తెలిపారు. 9 నెలల వరకూ పాపను చూడటానికి రాలేదని అన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడించిన తర్వాత తమను తీసుకెళ్లేందుకు అంగీకరించాడని నికితా అన్నారు. అయితే హైదరాబాద్ కు తీసుకురాకుండా అత్తవారింటికి తీసుకెళ్లాడని.. అక్కడ మళ్లీ తనను టార్చర్ చేశాడని ఆరోపించారు. దీంతో తమ తల్లిదండ్రులు వచ్చి తనను పుట్టింటికి తీసుకెళ్లిపోయారని చెప్పారు. అయితే భర్త ఎంతకూ వచ్చి తనను తీసుకెళ్లకపోవడంతో.. తానే హైదరాబాద్ లోని నివాసానికి వచ్చినట్లు చెప్పారు. తీరా ఇల్లు అమ్మేసినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నికితా వివరించారు.