Chiranjeevi: అవును.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఆయన అభిమానులు అయితే ఎంచక్కా ఎగిరి గంతులేస్తున్నారు. అదేంటబ్బా.. చిరు కోర్టు మెట్లు ఎందుకెక్కారు? అసలు పంచాయితీ ఏంటనే కదా? మీ సందేహం.. అక్కడికే వస్తున్నాను ఆగండి. చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణ (రెనోవేషన్)లో భాగంగా చేపట్టిన కొన్ని నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని జీహెచ్ఎంసీ (GHMC)ని అభ్యర్థించారు. అయితే ఆ దరఖాస్తుపై జీహెచ్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా రోజులు, నెల రోజులు గడుస్తున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక చిరంజీవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిరు.. కోర్టుకు సమర్పించిన దరఖాస్తును నిశితంగా పరిశీలించిన ధర్మాసనం.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. చిరంజీవి ఇంటికి సంబంధించిన దరఖాస్తును క్లియర్ చేయాలని హైకోర్టు (TG High Court) జీహెచ్ఎంసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హమ్మయ్యా.. లైన్ క్లియర్ అయ్యిందని మెగాస్టార్ తెగ సంతోష పడుతున్నారట.
Read Also- YSRCP: రోడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే.. సమస్య పరిష్కరించేదెవరు?
కోర్టులో ఏం జరిగింది?
జూన్ 5న చిరంజీవి తన ఇంటికి సంబంధించిన రిటైనింగ్ వాల్ (రిటైన్ వాల్)ను క్రమబద్ధీకరించాలని జీహెచ్ఎంసీలో దరఖాస్తు చేసుకున్నారు. చిరంజీవి తరపు న్యాయవాది, 2002లో జీ+2 ఇంటిని నిర్మించడానికి అనుమతి తీసుకున్నారని కోర్టుకు విన్నవించారు. రెనోవేషన్‌లో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా పర్మిషన్ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. అటు జీహెచ్ఎంసీ తరఫున న్యాయవాది, చట్ట ప్రకారం చిరంజీవి దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తుపై చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ కేసును ముగించారు. ఇలాంటి హైకోర్టు తీర్పులు భవిష్యత్తులో ఇతర నిర్మాణ దరఖాస్తులపై జీహెచ్ఎంసీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు లేదా సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా చిరంజీవి ఇలా చేశారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి.. ఇలాంటి మార్పులు లేదా అదనపు నిర్మాణాలు చేసినప్పుడు, వాటికి స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తప్పనిసరి. లేదా వాటిని చట్టబద్ధం చేయించుకోవడం అవసరం. లేకపోతే అవి అక్రమ నిర్మాణాలుగా పరిగణించబడతాయి.
ఎందుకీ పరిస్థితి?
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్లకు (లంచాలు) అలవాటు, చేయి తడపనిదే ఏ పనీ చేయట్లేదనే ఆరోపణలు కోకొల్లలు. నిర్మాణ అనుమతులు, ప్లాన్ అప్రూవల్స్, క్రమబద్ధీకరణ వంటి కీలకమైన పనుల కోసం నగర ప్రజలు తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ‘బిల్డ్ నౌ’ వంటి పారదర్శక విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కథనాలు ఉన్నాయి. అంతేకాదు.. ప్రజలు తమ పనులు చట్టబద్ధంగా జరగడానికి కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తోందని మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. లంచం ఇస్తే సరే లేదంటే వారి పనులు ఆలస్యం అవుతాయి లేదా నిలిచిపోతాయనే పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ఇది ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దరఖాస్తుకు సంబంధించిన పురోగతి గురించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పనుల ఆలస్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇక లంచం పదే పదే డిమాండ్ చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) ఇలాంటి కేసులను విచారిస్తుంది. ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, డాక్యుమెంట్లు లాంటి రుజువులు ఉంటే, నేరుగా ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అంటూ వ్యవహరిస్తున్న వారి భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.