TDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకొచ్చి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగానే హెచ్చరికలు చేశారు. దీంతో టీడీపీ నేతలు, మంత్రులు.. మాజీ మంత్రులు మీడియా ముందుకొచ్చి దుమ్ము దులిపి వదిలారు. బుధవారం నాడు.. పాయకరావుపేటలో చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత.. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదు. 50 వేల మెజారిటీతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గెలిచారు. ప్రసన్నకుమార్ రెడ్డికి, ప్రశాంతి రెడ్డి చెల్లి వరుస అవుతారట. నల్లపురెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పు పెట్టాయి. ప్రసన్నకుమార్ రెడ్ది.. జగన్మోహన్ రెడ్డి దగ్గరే నేర్చుకున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి తీరును ఎవ్వరు హార్షించరు. ఒక జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సమర్థిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది. రౌడీషీటర్లను జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు. జగన్ ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయ తొక్కించారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రప్పా రప్పా నరకతామనడం తప్పు కాదంట. ప్రసన్నకుమార్ రెడ్డిపై తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి అనిత హెచ్చరించారు.
Also Read- YS Jagan: వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి?
సినిమాల్లో లాగా నిజ జీవితంలో చేస్తే?
జగన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాల్లో చేసే హత్య, మానభంగాలు సమాజంలో చేసినా తప్పు లేదంటారా..? వివేకం కూడా సినిమానే కదా.. కోర్టుకు వెళ్లి ఎందుకు ఆపమన్నారు? రఘురామకృష్ణం రాజును పోలీసులతో హింసించిన విషయం మరిచారా? గవర్నర్ పేరుతో అప్పులు చేసింది చాలక.. ఇంకా విమర్శలు చేస్తున్నారా? జగన్ రెడ్డి పాత సినిమాల్లో విలన్ రాజనాలను తలపిస్తున్నారు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి.. తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారు. 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఛీకొట్టినా.. ఇంకా సిగ్గు లేకుండా కామెంట్లు చేస్తున్నారు. ఓ డీఐజీని మాఫియా డాన్ అంటారా..? సినిమాల్లో చూపినవి.. బయట అనుకరిస్తే తప్పా అని సిగ్గు విడిచి జగన్ ప్రశ్నిస్తున్నారు. సినిమా అనేది వినోదం కోసమే, సినిమాల్లో హత్యలు ఉంటాయి.. అత్యాచారాలు ఉంటాయి.. ఇవన్నీ చూసివచ్చి బయట కూడా చేయమంటారా?’ అని నక్కా ఆనందబాబు తీవ్రంగా హెచ్చరించారు.
Also Read- Pregnancy Yoga tips: గర్భిణి స్త్రీలు యోగా చేస్తే ఏమవుతుంది.. ఏ జాగ్రత్తలు పాటించాలి.. ఓ లుక్కేయండి!
సమాధానాలివ్వు జగన్!
ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. జగన్ రెడ్డికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ‘తెలుగుదేశం పార్టీని సైకోల పార్టీగా జగన్ అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు సిసలు సైకో పార్టీగా వైసీపీని గుర్తించి 11 సీట్లకు పరిమితం చేశారు అయినా బుద్ధి రాలేదు. అత్యంత ఆశ్చర్యకరం జగన్ రెడ్డి అబద్దాలకి సైకో చర్యలకు పరాకాష్ట ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని మార్చలేని అధికారిగా జగన్ ప్రశంసించడం. ధనుంజయ రెడ్డి లాంటి మంచి అధికారిని కూడా వేధిస్తున్నారని జగన్ మాటలు వినడానికి కంపరంగా ఉంది. అయ్యా.. జగన్ రెడ్డి నీకు ధనుంజయ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే ధనుంజయ రెడ్డి ఏ తప్పు చేయలేదు, తప్పు చేస్తే కేసు నమోదు చేయమని సిబిఐకి లేఖ రాయగలవా? సూటిగా స్పష్టంగా నా ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పగలిగితే సంతోషం’ అని ఎక్స్ వేదికగా జగన్ రెడ్డిని కోటంరెడ్డి ప్రశ్నించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు