Malnadu restaurant drugs case: మల్నాడు రెస్టారెంట్డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. దీంట్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్న ఈగల్ టీం(Eagle Team) అధికారులు కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల పుత్రరత్నాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది పోలీసులతోపాటు అన్ని వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది. పోలీసు(Police) అధికారుల సుపుత్రులే డ్రగ్స్ దందా చేయటం ఏంటి? అని అందరూ చర్చించుకుంటున్నారు. పక్కా సమాచారం మేరకు ఇటీవల ఈగల్ టీం అధికారులు కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్నడిపిస్తున్న సూర్యను రెస్టారెంట్వద్దనే పట్టుకున్న విషయం తెలిసిందే. అతని కారులో తనిఖీ చేయగా డ్యాష్‌బోర్డులో ఓజీ కుష్, ఎక్టసీ పిల్స్ దొరికాయి. ఇక, కారులో మహిళలు ధరించే హై హీల్స్ సైండిళ్లను కూడా అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. దీంట్లో హీల్ భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన అరలో కొకైన్ లభ్యమైంది.
అధికారులు కోర్టులో పిటిషన్
ఈ క్రమంలో అధికారులు సూర్యను అరెస్ట్‌చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాలతో మరో అయిదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి జ్యుడిషియల్రిమాండుకు తరలించారు. కాగా, కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నాలుగు రోజులపాటు నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో సోమవారం సూర్యతోపాటు మిగితా నిందితులను అదుపులోకి తీసుకున్న ఈగల్టీం అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంట్లో ఎస్ఐబీలో ఓస్డీగా పని చేస్తున్న వేణుగోపాల్ రావు(Venugopal Rao) కుమారుడు రాహుల్‌తేజ(Rahul Teja)కు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైంది. రాహుల్ తేజ డ్రగ్స్ పార్టీలు చేసుకోవటంతోపాటు మాదక ద్రవ్యాలను కొంతమందికి విక్రయించినట్టుగా తేలింది. 2024, జనవరిలో అతనిపై నిజామాబాద్ పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులో నమోదు చేసినట్టుగా వెల్లడైంది.
రాహుల్ తేజ కేసులో ఉండి కూడా
ఈ కేసులోని మిగితా నిందితులు రాహుల్ తేజ ఢిల్లీ, పంజాబ్‌ల నుంచి డ్రగ్స్ తెచ్చి తమకు ఇచ్చేవాడని వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే, నిజామాబాద్ పోలీసులు ఈ కేసులో రాహుల్ తేజను అరెస్ట్ చేయలేదు. పోలీసు అధికారి కుమారుడు కావటం వల్లనే నిజామాబాద్ పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి పంపించ లేదని సమాచారం. అప్పటి నుంచి రాహుల్ తేజ కేసులో నిందితునిగా ఉండి కూడా కనీసం బెయిల్ కూడా తీసుకోకుండా యధేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. తన డ్రగ్స్ దందాను కొనసాగిస్తూ వస్తున్నాడు. విచారణలో వెల్లడైన ఈ వివరాలతో ఈగల్ అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో రాహుల్తేజపై నిజామాబాద్‌లో నమోదైన కేసు వివరాలను తెప్పించుకున్నారు. దాంతోపాటు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న దానిపై విచారణ జరుపుతున్నారు. కేసు నమోదైనపుడు అధికారులు ఎవరు ఉన్నారు? అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు.
Also Read: Harish Rao Slams Congress: కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థుల మృతి
మరో సుపుత్రుడు
ఇక, నిందితులను రెండో రోజు జరిపిన విచారణలో మరో పోలీసు అధికారి కుమారుని పేరు బయట పడింది. సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate)లో ఆర్మడ్ రిజర్వ్‌డ్ డీసీపీగా పని చేస్తున్న సంజూ పుత్రరత్నం మోహన్(Mohan)కు కూడా మల్నాడు డ్రగ్స్కేసుతో సంబంధం ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. మోహన్(Mohan)కూడా డ్రగ్స్ సేవించటంతోపాటు మాదక ద్రవ్యాల విక్రయాలు చేస్తున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో ఈగల్టీం అధికారులు మంగళవారం మోహన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది.
ఎక్కడెక్కడ పార్టీలు
ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు అరెస్టయిన నిందితులందరూ ఏయే పబ్బులు, రిసార్టుల్లో డ్రగ్ పార్టీలు చేసుకున్నారన్న దానిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం ములుగు(Mulugu)లో కూడా నిందితులు మాదక ద్రవ్యాలతో దావత్‌లు చేసుకున్నట్టుగా సమాచారం. వీరిలో మరికొందరు పోలీసు అధికారుల కుమారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
సినీ పరిశ్రమకు చెందినవారు సైతం
కాగా, మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితులకు టాలీవుడ్ లోని కొందరికి సన్నిహిత పరిచయాలు ఉన్నట్టుగా తెలిసింది. వీళ్లు ఎవరు? అన్న దానిపై ఈగల్టీం అధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం. విచారణలో ఎవ్వరి పేర్లు వెల్లడైనా? వాళ్లు ఎంతటి వాళ్లయినా? అరెస్టులు చేయటం ఖాయమని ఈగల్ టీం అధికారి ఒకరు చెప్పారు.
Also Read: Nimisha Priya: నిమిషా ప్రియాకు ఎల్లుండే ఉరి.. ఏమీ చేయలేమన్న కేంద్రం