Harish Rao Slams Congress: కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృందంగం వినిపిస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao)అన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. గురుకులాల ఖ్యాతి నానాటికి దిగజారుతున్నదంటే దానికి కారకులు ఎవరు, విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండడం దారుణం అన్నారు.
విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ చూపుతున్న నిర్లక్ష్య వైఖరితో లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించి నెలలు గడుస్తున్నా వాటి దుస్థితి మాత్రం మారలేదన్నారు. విద్య సంవత్సరం మొదలైందంటే పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారని సంబుర పడాల్సింది పోయి, వారి ప్రాణాల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చింది అని వ్యాఖ్యానించారు.
Also Read:Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
విద్యా వ్యవస్థ నేడు దిక్కుతోచని స్థితికి
వరుసగా చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని గ్రామాల్లోని తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం అన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నదని, నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యా వ్యవస్థ నేడు దిక్కుతోచని స్థితికి చేరిందన్నారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు మెస్ చార్జీలను చెల్లించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి ఏడాది గడిచింది తప్ప అమలు జరగలేదని ఆరోపించారు.
నాణ్యమైన ఆహారం అందించాలి
ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు తినకలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక గుడ్లు, పండ్లు అందించని పరిస్థితి నెలకొందన్నారు. ఇంకెన్ని రోజులు విద్యార్థులు పస్తులుండాలి, ఇంకెన్ని రోజులు గొడ్డు కారం అన్నం తిని కడుపు నింపుకోవాలి అని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఫుడ్ పాయిజన్లు నిరోధించాలని, ఆత్మహత్యలు జరుగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాలను స్వయంగా మానిటర్ చేస్తానన్న సీఎం మాటలు నీటి మూటలు అయ్యాయని హరీశ్ రావు మండిపడ్డారు.