Banakacherla Projet: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు తేల్చేందుకు, ముఖ్యంగా బనకచర్ల ఇష్యూని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నది. దీనికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం అందించింది. జలశక్తి శాఖ అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కీలక లేఖ పంపింది. బనకచర్లపై చర్చకు ససేమిరా అని తేల్చి చెప్పింది.
చర్చించడానికి ఏముంది?
ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ సమక్షంలో జరిగే సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. అయితే, బనకచర్లపై చర్చించడానికి ఏమీ లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని అందులో స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని గుర్తు చేసింది. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, పూర్తి వివరాలను లేఖలో ప్రస్తావించిన తెలంగాణ ప్రభుత్వం, చట్టాలను, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలా కాకుండా చర్చ జరిపితే, కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయత దెబ్బ తింటుందని లేఖలో పేర్కొన్నది. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని అడిగింది. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం చేయాలని కోరింది. అలాగే, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను పంపించింది.
Read Also- Muralidhar Rao: ఏసీబీ అదుపులో మాజీ ఈఎన్సీ.. అవినీతి చరిత్ర పెద్దదే!
బనకచర్లపై ముందు నుంచీ అభ్యంతరాలు
పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని కృష్ణాకు అనుసంధానం చేసి అక్కడి నుంచి బనకచర్లకు అటు నుంచి రాయలసీమకు నీళ్లు పారించాలనేది ఏపీ ప్రభుత్వం ప్లాన్. ఈ భారీ ప్రాజెక్ట్ కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖలు పంపుగా, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి దీనిని అడ్డుకుంటున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఇదే క్రమంలో రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనని కేంద్రం ఏపీకి స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడం, అందులో బనకచర్ల ప్రస్తావన ఉండొద్దని తెలంగాణ తిరిగి లేఖ పంపడం చర్చనీయాంశంగా మారాయి.
Read Also- Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ