Dharmavaram Saree: అవును.. ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు దక్కింది. భారతదేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత పట్టు చీర 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కార్యక్రమం క్రింద ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ గౌరవం ధర్మవరం పట్టు చీరల ప్రత్యేకతను, నైపుణ్య సంపదను దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపుచేసే దిశగా కీలకంగా మారనుంది. ఈ సందర్భంగా సోమవారం.. న్యూ ఢిల్లీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత పరిశ్రమల శాఖ మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ చేతన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Read Also- Health News: రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే మీ పని గోవిందా.. ఎందుకో రండి చెబుతా!
గుర్తింపుగా..
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఈ అవార్డులు వాణిజ్య రంగానికే కాకుండా, స్థానిక పరిశ్రమలకు విశేష ప్రోత్సాహం కలిగిస్తున్నాయన్నారు. ఇది కేవలం హస్తకళల ప్రదర్శన మాత్రమే కాకుండా, భారతదేశ భవిష్యత్తుకు ఒక సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు లభించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుకు ధర్మవరం చేనేత పట్టు చీరలతో పాటు, కాకినాడ జిల్లా పెద్దాపురం శిల్క్, బాపట్ల జిల్లా చీరాల శిల్క్ చీరలు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు కూడా ఎంపికయ్యాయి. ఈ ఎంపిక ద్వారా రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలు మరియు చేనేత ఉత్పత్తుల విలువ మరింతగా పెరిగే అవకాశం కలుగుతుంది. రూ.35 కోట్లతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్స్ క్లస్టర్ ఏర్పాటుకు డెవలప్మెంట్ కమీషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్, న్యూ ఢిల్లీ వారికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలో ఇది ఏర్పాటు కానుందన్నారు.
జిల్లా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. ధర్మవరం చేనేత కార్మికుల నైపుణ్యానికి, పట్టుదలకు ఇది గౌరవ సూచికని, ఈ అవార్డు వల్ల ధర్మవరం చేనేత రంగానికి మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయన్నారు. మార్కెట్, ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి, అంతర్జాతీయ గుర్తింపు సాధించే మార్గంలో ఇది ఒక మైలురాయి అవుతుందన్నారు. ధర్మవరం చేనేత పట్టు చీరలకు ఈ గౌరవం దక్కినందుకు జిల్లా ప్రజలకు, చేనేత కార్మికులకు మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సహాయ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి జితిన్ ప్రసాద, తదితరులు పాల్గొన్నారు.
అవార్డులే.. అవార్డులు
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 9 ఉత్పత్తుల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్‌కు ఓడిఓపి అవార్డు లభించింది. ఇప్పటికే ‘నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ కు గత సంవత్సరం (జిఐ) గుర్తింపుకు ఎంపిక కాబడింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లేసుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25, 2024న న్యూఢిల్లీలోని హోటల్ ఒబెరాయ్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని ‘నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతులు మీదుగా (జిఐ) సర్టిఫికేట్‌ను అందుకున్నారు.
Read Also- Shubman Gill: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మాన్ గిల్