Tummala Nageswara Rao: దేశానికి ఆయిల్ పామ్ ఆయిల్ ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ(Telangana) ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని పెద్దవీడు గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి రాష్ర్ట వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy), చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్య(MLA Kale Yadayya)లతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వంద లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ అవసరమని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు అవుతున్నట్లు తెలిపారు. దీంతో ఇతర దేశాల నుంచి లక్షన్నర కోట్లు పెట్టి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి చెప్పారు. రాష్ర్టంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటసాగుకు వీలు ఉందని, కనీసం 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట వేసినా, దేశానికే మన రాష్ర్టం ఆయిల్ పామ్ సరఫరా చేయవచ్చన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో రాష్ర్టంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పది ఫ్యాక్టరీలను నిర్మించనున్నామని, ఇందుకోసం పూర్తి అనుమతులు పొందడం జరిగిందన్నారు. వచ్చే నెలలో సిద్ధిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: Chandrababu: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు?
రైతులెవరూ భూములు అమ్ముకోవద్దు
రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. 40 ఏళ్ల వరకు ఢోకా లేని, లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేయాలని సూచించారు. జిల్లాలోని రైతులు ఎవరూ భూములు అమ్ముకోవద్దని, పంటలు వేసుకోవాలని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లా అన్నింట్లోనూ సస్యశ్యామలం అవుతుందని మంత్రి వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతోందని, ఈ సంవత్సరం మరో మూడు వేల ఎకరాలు పెరగాలని ఆయన సూచించారు. కంపెనీ వారే తోటల వద్దకు వచ్చి పంటను సేకరిస్తారని, ధర, రవాణా వంటి ఇబ్బందులు కూడా ఉండవన్నారు. కొనుగోలు వేసిన వెంటనే రైతుల ఖాతాలలోకి డబ్బును జమ చేస్తారని మంత్రి తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతులు ఆయిల్ పామ్(Oil palm) పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
మార్కెట్ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల నిధులు
రైతు భరోసా, రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసిన ఘనత రాష్ర్ట ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాలో 2 లక్షల 83 వేల మంది రైతులకు 323 కోట్ల 50 లక్షలు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. అదే విధంగా రుణమాఫీ కింద ప్రతి రైతుకు రెండు లక్షల చొప్పున మాఫీ చేస్తూ జిల్లాలో 1 లక్షా 4వేల మంది రైతులకు రూ.747 కోట్ల 41 లక్షలు రుణ మాఫీ చేశామన్నారు. సర్దార్ నగర్ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసిందని మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఉద్యానవన, పట్టు పరిశ్రమల డైరెక్టర్ యస్మిన్ బాషా, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Also Read: Kavitha and Teenmaar Mallanna: ఎప్పుడూ ఏదో ఒక లొల్లి.. ప్రజా సమస్యలపై లేని సోయి?