- జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ వేడుకలు
- కాంగ్రెస్ సర్కార్ హయాంలో జరిగే సంబురాలు
- ధూంధాంగా నిర్వహించాలనే యోచనలో సీనియర్ కాంగ్రెస్ నేతలు
- ఆవిర్భవ వేడుకలకు రానున్న సోనియా, రాహుల్, ప్రియాంక
- ముగియనున్న పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు
- ఇకపై తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్
- కేసీఆర్ దశాబ్ది వేడుకలకు ధీటుగా జరపాలని నిర్ణయం
- క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం
June 2 Telangana emergence day Sonia, Rahul, Priyanka inaugurate:
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ,మల్లిఖార్జున ఖర్గేని ఆహ్వానించే ఆలోచనతో సీఎం రేవంత్ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఈ వేడుకలకు ఆహ్వానిస్తే.. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ నేతల దృష్టికి సీఎం తీసుకెళ్లినట్టు సమాచారం. త్వరలోనే సోనియా టూర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.
తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్
ఇప్పటికే తెలంగాణ ఆవిర్భవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎంకు సూచనలు ఇస్తున్నారు. పైగా ఈ సారి వచ్చే తెలంగాణ ఆవిర్భవ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏపీ విభజన హామీల చట్టం ప్రకారం పదేళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకే పరిమితం కానుంది. ఏపీలో జూన్ 4 తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఇకపై హైదరాబాద్ పై ఎలాంటి అధికారాలు ఉండవు. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధానిలో ఉన్న ఏపీ భవనాలు ఇకపై తెలంగాణ పరిధిలోకి వస్తాయి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణకు రాజధానిగా అవతరించబోతోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న తెలంగాణ ఆవిర్భవ వేడుకలకు సోనియాగాంధీని పిలిపించి తెలంగాణకు రాజధాని ఇచ్చింది సోనియానే అని తెలియజెప్పేందుకు అగ్రనేతలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఎలాగూ ఎన్నికల సందడి కూడా అయిపోతుంది అప్పటికి. రేవంత్, సీనియర్ నేతల అభ్యర్థనలను కాంగ్రెస్ అగ్ర నేతలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దశాబ్ది వేడుకలు
గత ఏడాది కేసీఆర్ ఆధ్వర్యంలో దశాబ్ది తెలంగాణ ఆవిర్భవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. వాడవాడల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ఎంతో ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు కేసీఆర్. అప్పట్లో పదేళ్ల పాలనలో జోష్ మీద ఉన్న కేసీఆర్ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, తాము సాధించిన విజయాలను ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆ వేడుకలు ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. వాటన్నింటినీ మర్చిపోయేలా తెలంగాణ ఆవిర్భవ వేడుకలను అత్యంత వైభవంగా జరిపించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. పైగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తొలి ఏడాదిలో నిర్వహించే ఈ వేడుకను అందరూ గుర్తుంచుకునేలా చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.