Kota Srinivasa Rao: టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇకలేరు. (Kota Srinivasa Rao) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం నాడు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నిజంగానే ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటు. ఎందుకంటే, ఏ పాత్ర కైనా ప్రాణం పొసే గొప్ప నటుడు. నవరసాలను అద్భుతంగా పలికించే వ్యక్తి. ఆ పేరే చాలు, ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.
నాటికి నేటికీ ఈయన పాత్రలు ఎవర్ గ్రీన్. నవ్వించినా ఆయనే, ఏడిపించినా ఆయనే, ఇక విలనిజం చేయాలన్నా కోట తర్వాతే ఎవరైనా, ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయేవారు. బహుశా ఈయన పాత్రలు నచ్చని సినీ ప్రియుడు లేరంటే నమ్మండి. ఒక్క మాటలో ‘టాలీవుడ్ కోట’ కుప్పకూలిందనే చెప్పుకోవచ్చు. ఆయన్ను అభిమానించే అభిమానులు, నటులు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మీరు ఈ భూమిపైన లేకున్నా మీ గుర్తులుగా మీరు మాకిచ్చి వెళ్లిన ఎన్నో గొప్ప పాత్రల్లో మిమ్మల్ని స్మరించుకుంటాం’ అంటూ సినీ ప్రియులు, అభిమానులు, నటీ నటులు చెప్పుకుంటున్నారు.
Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?
సినిమాల్లోకి ఎంట్రీ
కోట శ్రీనివాసరావు సొంతూరు కృష్ణా జిల్లా కంకిపాడు. తండ్రి కోట సీతారామాంజనేయులు వైద్యుడు. 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కోట జన్మించారు. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. బాల్యం నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. బాల్యం నుంచి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట, సినిమాల్లో రంగప్రవేశం చేసేనాటికి రంగస్థలంపై 20 ఏళ్ళ అనుభవం గడించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు.
ఎంతో మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులు అందరినీ సినిమాలోకి కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) సినీరంగ ప్రవేశం అనుకోకుండానే జరిగిపోయింది. అంతవరకూ ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు కూడా సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘అహ నా పెళ్ళంట’ మూవీలో కథానాయిక తండ్రిగా చేసిన ‘పిసినిగొట్టు’ పాత్ర మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. బలమైన నాటకరంగ నేపథ్యం ఉండడం, అనేక నాటకాలలో నటించి, గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఇది ఆయన సినీ కెరీర్‌లో వివిధ పాత్రలను సులభంగా పోషించడానికి సహాయపడింది. ఇక అప్పట్నుంచి విలన్‌గా, కమెడియన్‌గా, సహాయ నటుడిగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే కోట దానికి న్యాయం చేశారు. ఆయన నటించిన పాత్రల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు.
అక్షరాలా నిరూపించారు!
కొన్ని పాత్రలు కొంత మంది కోసమే పుడతాయి అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ మాట అక్షరాలా కోటకు సరిగ్గా సూట్ అవుతుంది. ‘యోగి’ సినిమాలో విలన్‌గా, వెంకటేష్ హీరోగా నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ (Venkatesh) తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖి’ సినిమాలో (NTR) ఎన్టీఆర్‌కు తాతగా నటించి మెప్పించారు. ‘గబ్బర్ సింగ్’ లో (Shruti Haasan) శ్రుతిహాసన్‌కు తండ్రిగా నటించారు. బాబు మోహన్, కోట కాంబో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. అలా వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. చిన్న చిన్న హీరోలు మొదలుకుని స్టార్, సీనియర్ హీరోల వరకూ సినిమాల్లో కమెడియన్, విలన్, తండ్రి ఇలా పలు పాత్రల్లో మెప్పించారు. కోట చివరి సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’. ఇందులో విలన్‌గా నటించారు. ఇప్పటి వరకూ 700లకు పైగా సినిమాల్లో నటించారు. ఈ నంబర్ చాలు ఆయన కెరీర్‌లో ఎంత బిజీగా ఉండేవారో, ఎంత మంది దర్శకులు ఆయన నటనను కోరుకున్నారో. ఈ సంఖ్యే ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్థానాన్ని స్పష్టం చేస్తుంది.
డైలాగ్స్, అవార్డ్స్
‘ఈడెవడ్రా బాబూ.. నాకేంటి.. మరి నాకేంటి.. మరదేనమ్మా నా స్పెషల్.. అయ్య నరకాసుర.. అంటే నాన్నా.. నేనైతే ఖండిస్తున్నా’ ఇలా ఎన్నో ఫేమస్ డైలాగ్స్ కోట నోటి నుంచి వచ్చాయి. ఈయనకు ప్రత్యేకమైన వాయిస్ మాడ్యులేషన్ ఉంది. ఇది పాత్రలకు ఒక ప్రత్యేకతను ఇస్తుంది. కొన్ని డైలాగ్స్ ఆయన వాయిస్‌లో వింటేనే వాటి ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. తెరపై విలన్ పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో ఆయన చాలా సరళమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిగా పేరు పొందారు. తోటి నటీనటులతో, టెక్నీషియన్లతో చాలా కలివిడిగా ఉంటారు. అలా కోట తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు. ఈయన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కోట నటనకు గాను అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. వాటిలో 9 నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా ఉన్నాయి.
❄️స్పెషల్ జ్యూరీ అవార్డ్: ప్రతి ఘటన (1985)
❄️ఉత్తమ విలన్: గాయం (1993)
❄️ఉత్తమ విలన్: తీర్పు (1994)
❄️ఉత్తమ నటుడు: లిటిల్ సోల్జర్స్ (1996)
❄️ఉత్తమ విలన్: గణేష్ (1998)
❄️ఉత్తమ విలన్: చిన్న (2000)
❄️ఉత్తమ సహాయ నటుడు: పృథ్వీ నారాయణ (2002)
❄️ఉత్తమ సహాయ నటుడు: ఆ నలుగురు (2004)
❄️ఉత్తమ సహాయ నటుడు: పెళ్లైన కొత్తలో (2006)
‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును అందుకున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య (Dr. Allu Ramalingaiah) కళాపీఠం జాతీయ పురస్కారం (2013) కూడా ఈయన నటనా ప్రతిభకు గుర్తింపుగా లభించింది. 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
కళామతల్లికే కాదు.. ప్రజాసేవ కూడా
తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. (Kota Srinivasa Rao) సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ప్రజాసేవలో కూడా భాగమయ్యారు. కోటకు బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరినప్పటికీ కోటకు పిలుపొచ్చినా సరే వద్దనుకుని కాషాయ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లోనే బీజేపీ తరఫున గెలిచారంటే మామూలు విషయం కానే కాదు.
కాంగ్రెస్, టీడీపీ మంచి ఊపు మీదున్న రోజులవి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయినా బీజేపీని వదల్లేదు. కోటాను కమలనాథులూ వదులుకోలేదు. అగ్ర నాయకత్వం కీలక నేతగానే పరిగణించింది. కానీ, కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సినిమాలవైపు చూడరని, రాజకీయంగానే స్థిరపడతారని అంతా భావించారు. కానీ, కళామతల్లిని మాత్రం వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారు.
కోట వివాదాలు
కోట శ్రీనివాసరావు సాధారణంగా వివాదాల జోలికి వెళ్ళని, ధర్మంగా మాట్లాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే, కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోటపై ఆ రోజుల్లోనే దాడికి తెగబడ్డారు. నిజంగానే ఇది ఆయన జీవితంలో ఒక మాయని మచ్చగా నిలిచిన సంఘటన. ఎన్టీఆర్ నటించిన ‘మండలేశ్వర రాజు’ అనే సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఒక సందర్భంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎన్టీఆర్ అభిమానులు కోట శ్రీనివాసరావుపై దాడి చేసి చితకబాదారు. ఈ ఘటన కారణంగా ఆయన కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తెలుగు సినిమాల్లో పరభాషా నటులకు పెద్ద పీట వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులకు, ఇతర పరిశ్రమల వారికి నచ్చకపోవడం వల్ల చర్చకు దారితీశాయి. 2021లో నటి అనసూయ భరద్వాజ్ గురించి కోట చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
టీవీలో యాంకర్లు, నటీమణులు వేసుకునే దుస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అనసూయకు నచ్చలేదు. దీనిపై అనసూయ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసింది. రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థికంగా తట్టుకోవాలని, ఆ పరిస్థితి తన దగ్గర లేదని, అందుకే యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉండలేకపోయానని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇది వివాదం కాకపోయినా, ఆయన రాజకీయ ప్రస్థానంపై చర్చకు దారితీసింది. ఇక పలు ఇంటర్వ్యూల్లో పలువురి నటీనటుల గురించి మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో గాండ్రిచ్చి ఉమ్మిన ఘటన గురించి చెబుతూ ఎంతో ఆవేదనకు లోనయ్యారు. ఇలాంటి విషయాలు మరెన్నో ఆయన పంచుకున్నారు.
ముగిసిన అంత్యక్రియలు
తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. సినీ రంగం నుంచి ప్రముఖులు, అభిమానులు మహా ప్రస్థానం వరకూ జరిగిన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయన మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
‘కోట’కు బీజేపీ నివాళి
కోట శ్రీనివాసరావు మృతిపై బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు మరికొందరు నేతలు స్వయంగా వెళ్లి కోట భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ, కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా సేవలందించారని, ఆయనలాంటి బీజేపీ సీనియర్ నాయకుడిని కోల్పోవడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. ఇదిలాఉండగా కోట శ్రీనివాసరావు మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: Kota Srinivas Rao: కోట శ్రీనివాసరావు ముక్కు సూటి మనిషి.. ప్రకాష్ రాజ్