Telangana News: తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం వైభవాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ(Telangana Sahitya Academy) వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భాషలోని పర్యాయ పదాలు, ప్రాచీన పదాలు, ఆధునిక,వాడుకపదాలతో కూడిన ‘తెలంగాణ పదకోశం’ సంకలనాన్ని సమగ్రంగా రూపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. సాహిత్య అకాడమీ పదాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణలో వాడుక భాష, యాస, మాండలికల్లో తేడాలు ఉంటాయి. ఉమ్మడి పది జిల్లాతోపాటు హైదరాబాద్(Hyderabad) నగరంలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మాట్లాడే వాడుక పదాలు, మాండలికలను ఒకచోట లభించేలా ‘తెలంగాణ పదకోశం’ రూపొందిస్తున్నారు. తెలంగాణ తెలుగులో ఉన్న వేలాది తేటతెనుగు పదాలతో 500 పేజీలతో పదకోశం అందుబాటులోకి తీసుకురానున్నారు.
మాండలికంపై శాస్త్రీయ పద్ధతులతో
కనుమరుగైన, వినుమరుగైనవి, కాలగర్భంలో కలిసిపోయిన, పోతున్న దశలో ఉన్న పదాలను వెతికిమరి ఇందులో చేర్చేందుకు సాహిత్య అకాడమీ కసరత్తు చేస్తుంది. తెలంగాణ పలుకుబడులు కుప్పులు తెప్పలుగా ఉన్నాయి. ఇన్నాళ్లు పాఠ్య పుస్తకాల్లో మనం మాట్లాడే భాషకు స్థానం లేదు. నిత్యజీవితంలో వాడే పదాలు కూడా పుస్తకాల్లో, పత్రికల్లో రాలేదు. విస్మరణకు గురైన వేల పదాలు ఇందులో కోకొల్లలు ఉన్నాయి. గతంలో వ్యక్తిగత స్థాయిలో కొంతమంది తెలంగాణ పదాలను ఏర్చికూర్చి పుస్తకాలుగా వెలువరించారు. అవి పూర్తిస్థాయిలో తెలంగాణ పదాలకు సరిపోలేదు. గ్రామాలతోపాటు ప్రాచీన సాహిత్య గ్రంథాల నుంచి పదాల సేకరించనున్నారు. తెలంగాణ సాహితీ వేత్తలతో తెలంగాణ పదాలు, మాండలికంపై శాస్త్రీయ పద్ధతులతో పద సేకరణ, వర్గీకరణ, పరిశోధనలు చేసిన తర్వాత ‘తెలంగాణ పదకోశానికి ఓ రూపు తీసుకురానున్నారు.
అంతేకాదు, తెలంగాణ వాడుక భాష(Telangana vernacular)లోని పదాలకు పర్యాయ పదాలను సైతం పదకోశంలో పొందుపరచనున్నారు. ఇది తెలంగాణ భాష అభివృద్ధికి దోహదం చేస్తుందని సాహితీవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతినెలా ఒకటి, మూడో శనివారాలను ‘సాహిత్య వారం’గా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కవులు, సాహితీవేత్తలు, రచయితలు పాల్గొని తమ నవలలు, కథలు, కవితలు, ఇతర రచనలను పుస్తకావిష్కరణ ద్వారా తమ కార్యక్రమాలను పరిచయం చేస్తున్నారు. సాహితీ వేత్తలతో చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోని వివిధ అంశాలపై లోతైన చర్చలు జరుపుతున్నారు.
Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!
యువతను సాహిత్యం వైపు ఆకర్షించేందుకు
కవితలు, కథలు, నవల రచనలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారిని ఆ దిశగా ప్రేరేపించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాల్లో ఆగష్టు, జనవరి, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో విద్యార్థులకు భాషా నైపుణ్యం, సాహిత్య రచన, కవిత్వం, కథల రచన, సాహిత్య విమర్శ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. యువతను సాహిత్యం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు సాహిత్యం(Literature) పట్ల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా, సాహిత్య అకాడమీ ‘తెలంగాణ గ్రంథ సూచి’ పేరుతో ప్రణాళికలను రూపొందిస్తోంది. తెలంగాణ సాహిత్యంలోని ప్రముఖ రచనలను ఒక సమగ్ర గ్రంథ సూచిగా తయారు చేసి, దానిని డిజిటల్, ముద్రణ రూపాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రంథ సూచి తెలంగాణ సాహిత్య చరిత్ర, దాని పరిణామాన్ని, ప్రసిద్ధ రచయితలు, వారి రచనలను ఒకే చోట అందజేసేలా రూపొందిస్తున్నారు.
కవులు, రచయితలు వివరాలు
కాంగ్రెస్ ప్రభుత్వం సాహిత్యంపై దృష్టిసారించింది. రాబోయే తరాలకు తెలంగాణ సాహిత్య వైభవం చాటాలని అందుకోసం కవులు, రచయితలు వివరాలను సేకరిస్తున్నారు. వారు చేసిన సాహిత్య కృషిని వారికి ఒక ప్రత్యేక పేజీ పేరుతో ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ పేరుతో ప్రచురణ చేస్తున్నారు. గత వైభవాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలను ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరం చేసింది. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలను శ్రీకారం చుట్టబోతున్నట్లు సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి తెలిపారు.
Also Read: KPHB Toddy Adulteration: కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్