Village Panchayats: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఆ గ్రామం పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. పెండింగ్ పనులు ఏం ఉన్నాయి, ప్రజల జీవన విధానం, గ్రామంలో ఇంకా ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలనే వివరాలపై ఆరా తీస్తున్నారు. సమగ్ర నివేదికను రూపొందించి ఆ గ్రామంలో చేయాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం సైతం తీసుకోబోతున్నట్లు సమాచారం.
గ్రామాల వివరాల సేకరణ
తెలంగాణలో 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే, గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా గతంలోని గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేయలేదని, విపక్షాలు సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించక పోవడంతో ఆ గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుమారు 18 నెలలు అయినప్పటికీ పంచాయతీలకు పాలక వర్గాలు లేవు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఉన్నాయి.
Also Read: Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లి ప్రియుడితో కలిసి ఘాతుకం
అభివృద్ధి పనులు సైతం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం రాకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయి. అయితే, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై దృష్టిసారించారు. గ్రామంలో ఆదాయ వనరులు ఏంటి. ప్రజల ప్రధాన వృతి, గ్రామంలో రోడ్లు, మురుగు కాల్వలు, కమ్యూనిటీ హాల్స్, యువతకు లైబ్రరీ, క్రీడా ప్రాంగణాలు, పాఠశాలలు ఉన్నాయా? అందులో వసతులు, పిల్లల సంఖ్య, ఆరోగ్య హెల్త్ సెంటర్లు, పశువైద్యశాలలు, తదితర వివరాలను సేకరిస్తున్నారు.
అదే విధంగా ఇంకా గ్రామాల్లోని ఏ వీధికి సీసీ రోడ్డు వేయాలి, మురుగు కాల్వలు నిర్మించాలి, వీధి లైట్లు వేయాలనే అంశాలను ఆరాతీస్తూ వాటిని నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. పనులు చేపట్టి మధ్యలో ఆగిపోయినవి ఏవి ఉన్నాయి? ఏవి ప్రథమ ప్రాధాన్యతగా చేపట్టాలనే అంశాలను సేకరిస్తున్నారు. వాటికి ఎన్ని నిధులు ఖర్చు అవుతాయి? వాటిని ఎలా సేకరించాలి? కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని నిధులు వస్తాయో అంచనా వేసి వాటికి అనుగుణంగా పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ (Panchayat Raj Department) శాఖ ప్లాన్ చేస్తుంది.
ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేసేలా ప్లాన్
గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) (ఎస్ఎఫ్సీ) నిధులు మంజూరు చేస్తుంది. అదే విధంగా కేంద్రం నుంచి ఆర్ధికసంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్ నిధులు), ఫౌండేషన్(స్వచ్ఛంద సంస్థలు), ఎన్ఆర్ఈజీఎస్, ఇతర శాఖల నుంచి సైతం నిధులు మంజూరు అవుతాయి. అయితే వీటిని ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj Department) ప్లాన్ చేస్తుంది. అంతేకాదు గ్రామాల సమగ్ర వివరాలను సేకరించి ఇవ్వాలని త్వరలోనే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరో వైపు గ్రామానికి ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీలో వాటా, భూమిశిస్తు, నల్లా బిల్లు, దుకాణాలపై పన్ను వస్తుంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో వసూలు చేయడం లేదు. అయితే దానిపైనా త్వరలోనే దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా గ్రామాలకు ఇతర ఆదాయ వనరుల సేకరణపైనా దృష్టిసారించారు. చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసి ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములుంటే లీజుకు ఇవ్వడం, తదితర అంశాలపై దృష్టిసారిస్తున్నారు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
అభివృద్ధిని పరుగులు పెట్టించాలని
ప్రతి గ్రామంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో గ్రామంలో పెండింగ్ పనులను విడతల వారీగా చేసేందుకు పంచాయతీరాజ్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అన్ని వివరాలను పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ ‘పీఎస్ యాప్’(పంచాయతీ సెక్రటరీ యాప్)లో అప్ లోడ్ చేయనున్నారు. ఆ యాప్‌ను క్లిక్ చేస్తే ఆ గ్రామ ముఖచిత్రం ఆవిష్కరణ కానుంది. ఆ గ్రామంలో ఎన్ని అభివృద్ధి పనులు చేయాల్సింది ఉంది. ఇప్పటివరకు ఎన్ని చేశారనే వివరాలను యాప్‌లో స్పష్టంగా పొందుపర్చనున్నారు. అధికారులకు సైతం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, పంచాయతీరాజ్ ఎన్నికలు కంప్లీట్ అయ్యాక గ్రామాల్లోని పెండింగ్ పనులపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
గ్రామాల ముఖచిత్రం రూపొందిస్తున్నాం
సృజన, డైరెక్టర్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖ
రాష్ట్రంలోని అన్ని గ్రామాల ముఖచిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆ గ్రామంలో పెండింగ్ పనులు ఎన్ని? ఏమేం చేయాల్సి ఉన్నాయి. ఆ గ్రామ ఆదాయ వనరులను బట్టి అభివృద్ధి పనులు చేపడతాం. అన్ని గ్రామాలను సమగ్రాభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడతాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాం.
Also Read: Raja Singh: ఆయన కారణంగానే రాజీనామా చేశా.. రాజాసింగ్