Kapil Sharma Cafe: భారతీయ పాపులర్ స్టాండ్‑అప్ కామెడీ ఆర్టిస్ట్, టీవీ హోస్ట్, నటుడు కపిల్ శర్మ ఇటీవల కెనడాలో ‘కప్స్ కేఫ్’ను (Kaps Cafe) ప్రారంభించిన విషయం తెలిసింది. ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే కేఫ్ టార్గెట్‌గా ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ బుధవారం రాత్రి ఏకంగా కనీసం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్టు అతడు ప్రకటన విడుదల చేశాడు. హర్జీత్ సింగ్ లడ్డీ ఒక కారులో కూర్చొని కాల్పులు జరపగా, పక్కనే కూర్చున్న మరో వ్యక్తి చిత్రీకరించినట్టుగా వీడియోలో కనిపించింది. కేఫ్ కిటికీపై వరుసగా తొమ్మిదిసార్లు కాల్పులు జరపడం వీడియోలో కనిపించింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు మొదలుపెట్టాయి.
ఎవరీ లడ్డీ?
ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో హర్జీత్ సింగ్ లడ్డీ కూడా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్య కేసులో హర్జీత్ సింగ్ లడ్డీ వాంటెడ్‌గా ఉన్నాడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 2024 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో వికాస్ ప్రభాకర్‌ను కాల్చి చంపబడ్డాడు. కపిల్ శర్మ గతంలో చేసిన ఓ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతడు కాల్పులకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కప్స్ కేఫ్ ద్వారా రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి కపిల్ శర్మ అడుగు పెట్టాడు. వ్యాపారపరంగా తాను చేసిన ఈ మొదటి ప్రయత్నంలో భార్య గిన్ని చత్రత్‌ను కూడా భాగస్వామి చేసుకున్నాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రేలో కేఫ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభించారు.
Read Also- Viral News: ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. తల్లి ఇప్పుడెలా ఉన్నారంటే?
కెనడా కేంద్రంగా కుట్రలు
కాగా, కెనడాకు చెందిన అగ్ర నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ గత నెలలో కీలక రిపోర్ట్ విడుదల చేసింది. కెనడా గడ్డ నుంచి భారతదేశంపై హింసాత్మక చర్యలకు ఖలిస్థానీ ఉగ్రవాదులు ప్రణాళికలు చేస్తున్నట్టు బహిర్గతం చేసింది. ‘ఖలిస్థానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశంలో హింసను ప్రేరేపించేందుకు, నిధుల సేకరణ, దాడులకు ప్లాన్ కోసం కెనడాను స్థావరంగా ఉపయోగిస్తున్నారు’’ అని స్పష్టంగా వివరించింది.
ప్రమాదకరంగా కెనడా
కెనడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై భారతదేశం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కెనడా ప్రభుత్వం తగినంత చర్యలు తీసుకోవడం లేదని అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ, ‘‘ప్రస్తుతం కెనడా మనకు అతిపెద్ద సమస్య. ఎందుకంటే, కెనడాలో అధికార పార్టీ, ఇతర పార్టీలు తీవ్రవాదం, వేర్పాటువాదం, హింసను సమర్థించేవారికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం పేరిట నిర్దిష్ట చట్టబద్ధతను కల్పించాయి. వారికి దృష్టికి ఏదైనా విషయాన్ని తీసుకెళ్లి సమాధానం లేదు. మాది ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం దేశమని సమాచారం ఇస్తున్నారు’’ అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కెనడా ప్రభుత్వ తీరులో మార్పు కనిపించడం లేదు. 2023లో నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ‘భారతీయ ఏజెంట్లు’ పాల్గొన్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి దిగజారాయి. ఈ ఏడాది ప్రారంభంగా కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిస్థితులు కాస్తంత మెరుగుపడ్డాయి.
Read Also- Karan Johar: కరణ్ జోహార్‌కు ఏమైంది?.. మరీ ఇలా మారిపోయారేంటి?