Janasena: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లి, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి. అందుకే ఆ పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి పదవిని సీఎం చంద్రబాబు (CM Chandrababu) కట్టబెట్టారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఈ మధ్య కాలంలో కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యేలు- జనసేన నేతల మధ్య, జనసేన ఎమ్మెల్యేలు- టీడీపీ నేతలు, క్యాడర్ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపాలు, అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నట్లుగా రోజూ మనం వార్తల్లో చూస్తున్నాం. టీడీపీ నాయకులు తమ నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు లేదా నాయకులతో సమన్వయం లేదని లేదా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వచ్చిన ఫిర్యాదు కోకొల్లలు. అలాగే, జనసేన నాయకులు కూడా కొన్ని చోట్ల టీడీపీ నాయకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, తమ పార్టీకి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా అంతకుమించే ఉన్నాయి. ఇక ఒకరి బాగోతాలు మరొకరు బయటపెట్టుకోవడంలో జనసేన, టీడీపీ నేతలు.. క్యాడర్ ముందున్నది. ఇప్పటికే పలువురు జనసేన ఎమ్మెల్యేలపై టీడీపీ.. టీడీపీ ఎమ్మెల్యేలపై జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also- HYDRAA: ‘బతుకమ్మ’ను బతికించిన హైడ్రా.. ఎలా సాధ్యమైంది?
అసలేం జరిగింది?
వివాదాలు, విభేదాలు కాసేపు అటుంచితే.. కడప జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు (Arava Sridhar) టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఏ రేంజిలో అంటే శ్రీధర్ ఎమ్మెల్యే అనే విషయం మరిచిపోయి.. కనీసం పొత్తు ధర్మం కూడా పాటించకుండా తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. అసలు విషయానికొస్తే.. రైల్వేకోడూరులో మద్యం ఏరులై పారుతోందన్న ఆరోపణలు చాలా రోజులుగా ఎమ్మెల్యేపైన ఉన్నాయి. అయితే ఆ విషయాన్నే టీడీపీ నేతలు అక్షరాలా నిజమని నిరూపించారు. అదికూడా ఇసుక లోడ్లలో మద్యం అక్రమంగా తరలిస్తున్నారని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారని ఎమ్మెల్యేపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్రమ మద్యం రవాణా (Illegal Liquor Transport) ఆపాలని, లేకపోతే లారీలకు అడ్డంగా పడుకుంటామని తెలుగు తమ్ముళ్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకుంటే సహించేది లేదని శ్రీధర్‌ను టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే పనితీరు, ఆయన చేష్టలపై సొంత పార్టీ కార్యకర్తల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏకంగా కూటమి నేతలే.. ఎమ్మెల్యే బాగోతాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ హెచ్చరించారు. దీంతో ఈ మొత్తం తతంగంపై ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారు..? అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.
Read Also- Shubhanshu Shukla: శుభాంశు రోదసి యాత్రలో ట్విస్ట్.. మరో 4 రోజులు వేచి చూడాల్సిందే!
కూటమిలో ముసలం..
మరోవైపు కొవ్వూరు నియోజకవర్గ కూటమిలోనూ ముసలం నెలకొన్నది. సొసైటీ పదవులు జనసేన, టీడీపీ నేతల మధ్య చిచ్చురేపాయి. జనసేనకు అన్యాయం జరిగిందంటూ ద్వితియశ్రేణి నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. జనసేన ఇన్‌ఛార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. సొసైటీ డైరెక్టర్ల సర్దుబాటులో అవకతవకలే కారణమని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. అయితే జనసేన మాత్రం మూడంటే మూడు మాత్రమే కోరుకున్నది. అవి కూడా ఇవ్వకపోవడంతో ఇలా తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. కాగా, జనసేన నేతలను సంప్రదించకుండా ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ప్రకటించి అవమానపరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో భాగంగా జనసేన నేతలను సంప్రదించకుండానే స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు సొంత నిర్ణయాలు తీసుకున్నారని టీవీ రామారావు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని నామినేటెడ్ పదవుల వరకూ ఇలాంటివన్నీ వార్తల్లో చాలానే చూసి ఉంటాం. ఇప్పుడు కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పోస్టుల పంపకం వంటి విషయాల్లో కొన్ని చోట్ల విభేదాలు మరిన్ని తలెత్తుతున్నాయి. ఈ వివాదాలకు ముగింపు ఎప్పుడో..? అసలు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రశ్నార్థకమే.
Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?
