Seethakka on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు (Mulugu) లో పోలీసు రాజ్యం ఉందంటూ ఆయన చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తే ఆయన నాశనమైపోతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ములుగు జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ తన చిల్లర రాజకీయాలు మానలని సూచించారు. సొంత చెల్లే (కవిత) ఆయన్ను దుమ్మెత్తిపోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఆమె సంగతి చూడాలని హితవు పలికారు.
చర్చకు సిద్ధమా?
నీలాగా కుల బలము, ధన బలము, అహంకార బలము తన వద్ద లేదని కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మంత్రి సీతక్క అన్నారు. గతంలో కేటీఆర్ నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ప్రస్తుతం తాను నిర్వహిస్తుంటే.. ఆయన తట్టుకోలేకపోతాన్నని మండిపడ్డారు. సొంత ఇంట్లోని ఆడబిడ్డనే కుట్రలు కుతంత్రాలతో వేధిస్తున్నావని కేటీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తారా? అంటూ సవాలు విసిరారు. ములుగు జిల్లాలోని లక్ష్మీదేవి పేట, చల్వాయి తో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద కేటీఆర్ గతంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు.
రాజకీయ డ్రామాలు
ములుగులో శాంతియుత వాతావరణం ఉందన్న మంత్రి సీతక్క.. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతోందని అన్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని చెప్పి మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారని కేటీఆర్ ను సీతక్క నిలదీశారు. మీకు రాజకీయ డ్రామాలు తప్ప.. బాధిత కుటుంబాలను ఆదుకునే సోయ లేదని మండిపడ్డారు. ములుగు నియోజకవర్గంలో పనిచేసే పోలీసు అధికారుల్లో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని సీతక్క అన్నారు. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మీరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Jangama District: భర్తను లేపేసిన ఇద్దరు భార్యలు.. గొడ్డలితో చెరొక వేటు..!
కేటీఆర్‌కు సంస్కారం లేదు!
చల్వాయిలో రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే.. తమను నిందించడం ఏంటని కేటీఆర్ ను సీతక్క ప్రశ్నించారు. కాస్త అయినా బుద్ది ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఈ సందర్భంగా సీతక్క స్పష్టం చేశారు. మీ హయాంలో ప్రజలను పొట్టన పెట్టుకుంటే.. తాము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని అన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ఎందరో వేధింపులకు బలి అయితే.. ఆ కుటుంబాలను కేటీఆర్ కనీసం పరామర్శించలేదని అన్నారు. ముఖ్యమంత్రి (CM Revanth Reddy)ని వ్యక్తిగతంగా దూషించే కేటీఆర్ కు సంస్కారం లేదని.. ఒళ్లంతా దూరంకారమేనని ఆరోపించారు. ఉద్యమ సమయంలో జనాలను రెచ్చగొట్టడంతో పాటు వారు చనిపోయేలా చేసి అధికారాన్ని సంపాదించారని మంత్రి సీతక్క అన్నారు.