SPDCL: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం దక్షిణ(Electricity distribution company) తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) (SPDCL) దృష్టి సారిస్తున్నది. సులువుగా సమస్యల కోసం ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేకంగా ఆయా సమస్యలకు ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా ఏరియాల వారీగా ఆ ప్రాంత ఫ్యూజ్ ఆఫ్ కాల్, ఏఈ, ఏడీఈ, డీఈ నెంబర్లను ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఆ స్టిక్కర్లను వినియోగదారులకు తెలిసేలా అపార్ట్‌మెంట్లు, బహుళ వాణిజ్య సముదాయాలు, హౌసింగ్ కమ్యూనిటీలు, ఇతర ప్రదేశాల్లో ఉంచుతున్నది. వినియోగదారులకు సమస్యల సత్వర పరిష్కారమందించేలా ప్రయత్నాలు చేస్తున్నది. వర్షాకాలం నేపథ్యంలో వినియోగదారులకు తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
Also Read: Artificial Intelligence: ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో కష్టాలు.. మార్ఫింగ్ వీడియోలతో మోసాలు!
ఇతర సేవలకు కూడా..
విద్యుత్ సరఫరా సమస్యలతో పాటు ఇతర సేవలకు సైతం ఫోన్ కాల్ ద్వారా ప్రక్రియ సులభతరమయ్యేలా సంస్థ ఏర్పాట్లు చేసింది. నూతన సర్వీసుల మంజూరు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, మీటర్ మార్పు వంటి ఏ ఇతర విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసమైనా ఆయా ఏరియాల వారీగా స్టిక్కరింగ్‌పై కేటాయించిన నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగరం మరింత విస్తరిస్తున్నది. పెట్టుబడులు రావడంతో పరిశ్రమలు, వాణిజ్య సదుపాయాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫోర్త్ సిటీ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఈ నేపథ్యంలో కనెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. వీటి పరిష్కారానికి సంస్థ తీసుకున్న నిర్ణయం మేలు చేసే అవకాశముంది.
వర్షాకాలం కావడంతో అలర్ట్
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Electricity distribution company)(ఎస్పీడీసీఎల్) (SPDCL) ఒక్కొక్కటిగా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. రాబోయేది వర్షాకాలం కాబట్టి వినియోగదారులకు ఇబ్బందులు రానివ్వకుండా జాగ్రత్తలు పాటించాలని సంస్థ నిర్ణయించింది. వానల నేపథ్యంలో క్రిటికల్ ఫీడర్లు, డీటీఆర్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం. ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేయడమే కాకుండా సమస్యల పరిష్కారానికి ఆయా ప్రాంతాలవారీగా నెంబర్ల విధానం ఏర్పాటు చేయడం ప్లస్ అవుతుందని సంస్థ భావిస్తున్నది. ఇప్పటికే విద్యుత్ శాఖలో మెరుగైన సేవల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ స్థాయిలో సరఫరాపై పర్యవేక్షణకు ఇది ఉపయోగపడనున్నది.
అంతేకాకుండా క్షేత్రస్థాయిలో సరఫరా, లోపాలను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలు దోహదం చేసే అవకాశమున్నది. ఇప్పటికే సబ్ స్టేషన్, ఫీడర్లలో ఫీడర్ మేనేజ్‌మెంట్ సిస్టంను సంస్థ అమలు చేస్తున్నది. ప్రస్తుతం సంస్థ పరిధిలో 8681, 11 కేవీ ఫీడర్లు ఉండగా వాటిలో 6885 ఫీడర్ల పరిధిలో ఫీడర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా పర్యవేక్షణ జరుగుతున్నది. భవిష్యత్‌లో మిగతా ఫీడర్ల ను కూడా ఈ సిస్టం పరిధిలోకి తీసుకురావడంపై సంస్థ కసరత్తు చేస్తున్నది.
Also Read:Warangal: ఇన్స్‌స్టా గ్రామ్‌లో రీల్ పోస్ట్.. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం!