BJP Vs Congress: బీజేపీ కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు దూకుడుగా ఉన్నారు. ఓవైపు క్యాడర్‌లో జోష్ నింపేందుకు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న ఆయన, ఇంకోవైపు అధికార కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అధ్యక్షుడిగా అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే, సీఎం రేవంత్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అమలుపై నిలదీశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా చేయలేదని మండిపడ్డారు. గ్యారెంటీలకు అనుబంధంగా ఇచ్చిన ఇతర హామీలపైనా ప్రశ్నించారు. అన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన సమర భేరి సభలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను తిట్టడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. రాంచందర్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖపై స్పందిస్తూ, ఎదురు ప్రశ్నలు వేశారు.
11 ఏళ్లుగా మోసం
కేంద్రంలో 11 ఏళ్లుగా బీజేపీ పాలిస్తున్నదని, దేశ ప్రజలను అడుగడుగునా వంచించిందని పొన్నం మండిపడ్డారు. వాగ్ధానాలతో ఊదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేంటని ఎదురు ప్రశ్నించారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా అన్ని వర్గాలను వంచించిన చరిత్ర బీజేపీకే సొంతమని విమర్శలు చేశారు. మీ వైఫల్యాలు రాస్తే రామయణమంత, వింటే భారతమంత. అలాంటి మీరు మా సీఎంకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ ఫైరయ్యారు. గురువింద సామెతను గుర్తు చేసేలా ఉన్న రాంచందర్ లేఖ చూస్తుంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేశారు.
Read Also- Kishan Reddy: బస్తీలో పర్యటన.. ముక్కు మూసుకున్న కేంద్రమంత్రి
ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రాంచందర్ రావు?
- పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఏడాది ఇచ్చే రూ.6 వేల కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామన్నారు. చేశారా?
- 60 ఏండ్లు దాటిన సన్న చిన్నకారు రైతులకు పించన్లు ఇస్తామన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఎంత మందికి ఇచ్చారు?
- తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం చేశారు. అలాంటిది ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తప్పుబట్టారు. దీనిపై మీ సమాధానం ఏంటి?
- తెలంగాణకు 11 సంవత్సరాల్లో బీజేపీ వల్ల ఏమన్నా లాభం జరిగిందా? ఒక్క రూపాయి రాలేదు. మీరు కానీ మీ 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేశారు?
- కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పదేళ్ల కిందటే దీనిపై హామీ ఇచ్చారు. 10 లక్షల ఉద్యోగ ఖాళాలు అలాగే ఉన్నది వాస్తవం కాదా?
- 11 ఏళ్లలో దేశంలో ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా? పైగా, కోటి 31 లక్షల మందికి రేషన్ బియ్యం ఎగ్గొట్టిన పాపం మీది కాదా?
- నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. దివ్యాంగులు, వృద్దులు, వితంతువులకు ఇచ్చే పించన్లను 11 ఏళ్లుగా పెంచకుండా అన్యాయం చేసింది ఎవరు? రైళ్లలో ఆయా వర్గాలకు రాయతీలను సైతం ఎత్తివేసింది మీరు కాదా?
- లీటర్ పెట్రోల్ ధరను రూ.70 నుంచి రూ.110 కి పెంచింది ఎవరు? గ్యాస్ బండ ధరను రూ.400 నుంచి రూ.1100 చేసింది ఎవరు?
- డాలర్ 60 రూపాయలు ఉన్నప్పుడు గుండెలు బాదుకున్న మోదీ, ఇప్పుడు 84 రూపాయలు చేశారు. దానిపై ఎందుకు మాట్లాడడం లేదు.
- రైళ్ల టికెట్ల ధరలు పెంచిది ఎవరు? యూపీలో 26 వేలు, ఎంపీలో 22 వేలు, దేశంలో లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసింది బీజేపీ ప్రభుత్వం కాదా?
- పీఎం ఫసల్ బీమా పథకంలో కేంద్ర వాటా తగ్గించి రైతులకు భారంగా మార్చింది ఎవరు?
- 2022 లోపు అందరికీ ఇండ్లు, టాయిలెట్లు, నల్లా కనెక్షన్లు ఇస్తామని హమీ ఇచ్చారు, ఏమైంది?
- తప్పుడు జీఎస్టీ, తప్పుడు ఆర్దిక విధానాలతో రాష్ట్రాలకు నష్టం చేస్తున్నది ఎవరు?
- రూ.130 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఏటా వడ్డీలకే రూ.12 లక్షల కోట్లు చెల్లిస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నది బీజేపీ కాదా?
- బీజేపీ తీరు వల్ల తెలంగాణ రెండు రకాలుగా నష్టపోతున్నది. విభజన హమీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నది ఎవరు?
- కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని గొప్పలు చెప్పే మీకు భద్రాద్రి రాముడికి 17 కిలోమీటర్ల దూరంలోని పాండురంగాపురం స్టేషన్ కనిపించడం లేదా?
- మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటి వరకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు, ఎందుకు?
- కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా నాన్చుతున్నది మీరు కాదా?
- ఇలా అడుగడునా తెలంగాణ ప్రజలను వంచించి, వట్టి లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదు రాంచందర్ రావు. చేతనైతే మోదీకి లేఖ రాసి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చండి అంటూ పొన్నం ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also- Samantha: ఆ వేదిక పై ” ఏం మాయ చేసావే ” మూవీని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సమంత