Harish Rao: బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల బాటకు సిద్ధమవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేతృత్వంలో బీఆర్ఎస్(BRS) నేతలు కదలనున్నారు. త్వరలోనే తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. తొలుత మేడిగడ్డకు వెళ్లి మరోసారి ప్రాజెక్టు ఘనతను, కూలిన పిల్లర్ మరమ్మతుల్లో నిర్లక్ష్యం అంశాలను ప్రజలకు వివరించాలని భావిస్తుంది. కేసీఆర్ ఆదేశాలమేరకు ప్రాజెక్టుల బాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వ్యవసాయరంగం చిన్నాభిన్నం
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో సాగునీటి రంగానికి చేసిన కృషి, వ్యవసాయ అభివృద్ధికి పాటుపడిన విషయాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిశీలన చేయాలని భావించి అందుకు ‘ప్రాజెక్టుల బాట’పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్(Congress) నిర్లక్ష్యంను ఎత్తిచూపాలని భావిస్తుంది. 19 నెలల్లో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయలేదని, వ్యవసాయరంగాన్ని చిన్నాభిన్నం చేసిందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. ఏ పనిచేయకుండా 2లక్షల కోట్లు అప్పులు చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని గులాబీ ప్రణాళికలు రూపొందిస్తుంది.
తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగమైన మేడిగడ్డకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో సహా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడే ప్రాజెక్టు ఘనతను, మేడిగడ్డ బ్యారేజీలో ఎన్ని ఫిల్లర్లు ఉన్నాయి. అందులో పగుళ్లు వచ్చిన పిల్లర్లు ఎన్ని వాటికి మరమ్మతులు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఆ భారం ఎవరు మోయాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం అంశాలను వివరించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆ తర్వాత మీడియా వేదికగాను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు సమాచారం. అనంతరం అందరూ నేతలంతా సహఫంక్తి భోజనాలు చేయనున్నట్లు సమాచారం.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ జనరల్ కీలక ప్రకటన
మీడియా ముందుకు బీఆర్ఎస్ అధినేత
ఆతర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సైతం బీఆర్ఎస్ బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది. అదే విధంగా రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటి దగ్గరకు వెళ్లి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని, రైతులపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని వివరించాలని భావిస్తున్నారు. అయితే ఒకటిరెండ్రోజుల్లో మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బనకచర్ల ప్రాజెక్టు అంశంను ప్రధానంగా వివరించాలని , కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీని ఎండగట్టనున్నట్లు సమాచారం. నీటిని ఒడిసిపట్టి చెరువులు, ప్రాజెక్టులు నింపడంలో వైఫల్యం, మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో యాసంగిలో రైతుల నష్టపోయిన విషయాన్ని వివరిస్తారని పార్టీ నేతలు తెలిపారు. ఆతర్వాతనే పార్టీ నేతలు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నట్లు తెలిసింది. అందుకు తేదీని సైతం త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ కార్యచరణ
త్వరలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల బాటపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే దళితబంధు, రైతు రుణమాపీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్, 4వేల ఫించన్, రెండులక్షల ఉద్యోగాలు, మహిళలకు 2500 ఇవ్వలేదనే అంశాలను ప్రచార అస్త్రంగా చేసుకోవాలని భావిస్తుంది. అందుకే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా జడ్పీటీసీని కూడా గెల్చుకోలేరని, స్థానిక ఎన్నికల నిర్వహించేందుకు సిద్దమా అని కేటీఆర్ సవాల్ చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రాజెక్టుల అంశంతో రైతులు, ప్రజలకు దగ్గరకావాలని వారి ఓటుబ్యాంకును ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తుంది.
Also Read: Congress Party: లైన్ క్రాస్ అయితే వేటు.. జూబ్లీ హిల్స్‌పై ఏఐసీసీ స్టడీ