Ponguleti Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలు, పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసి, వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఈ రెండు పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి కలెక్టర్లు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే పదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని వివరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తయితే, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని నొక్కి చెప్పారు.
Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి
ఇందిరమ్మ ఇండ్ల విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, దాని ప్రభావం ఈ పథకంపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నట్లు శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ అంశాలను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలని స్పష్టం చేశారు. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేయడానికి వెనుకాడవద్దని కలెక్టర్లను హెచ్చరించారు.
ప్రతి ఇల్లు అర్హులకే అందాలని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. అలాగే, ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, ఇటుకల కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించిందని, వీలైనంత త్వరగా ఈ కమిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.