CM Revanth Reddy: ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని, డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని, అందుకే ఆ విధానాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడంపై అధికారులు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు.
Also Read: Government Jobs: సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ప్రయారిటీ!
పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఇంటర్మీడియట్ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమని, ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
భారీ జాతీయ జెండా ఏర్పాటు
ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పని చేసే ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభలోనూ చర్చ పెడుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున, రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి స్పందించిన టూరిజం శాఖ!