Telangana BJP president: తెలంగాణ భాజపా (BJP) కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అధ్యక్షపదవి కోసం నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నుంచి స్వయంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో.. రామచందర్ రావు ఎంపిక లాంఛనంగా మారింది. దీంతో రేసులో నిలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు, అధ్యక్ష పదవి కోరుకుంటున్న ఎమ్మెల్యే రాజా సింగ్ దీనిపై స్పందించారు. కేంద్రం మంత్రి బండి సంజయ్ సైతం రియాక్ట్ అయ్యారు.
రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో భాజపా అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని రాజా సింగ్ అన్నారు. అయితే అధ్యక్షుడ్ని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకూ ఓటేసి ఎన్నుకోవాలని అన్నారు. మావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ వెళ్తే పార్టీకే నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అధ్యక్షుడి కోసం ఎన్నిక జరగాల్సిందేనని రాజా సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు తావిచ్చాయి.
ధర్మపురి అర్వింద్ ఏమన్నారంటే!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం దాదాపుగా ఖరారైన వేళ.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) స్పందించారు. అధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్ వేసినా పార్టీ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేశారు. రానున్న కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పనిచేయనున్నట్లు వివరించారు. అయితే పార్టీ అధ్యక్షుడి రేసులో తొలి నుంచి బలంగా వినిపించిన పేర్లలో ధర్మపుర్ అర్వింద్ కూడా ఉంది. రేసులో ఉన్న మరో ఎంపీ ఈటల రాజేందర్ తో ఆయనకు గట్టి పోటీ ఉంటుందని అంతా భావించారు. తీరా రామచందర్ రావు తెరపైకి రావడంతో వారి ఆశలు గల్లంతయ్యాయని రాజకీయ వర్గాల విశ్లేషిస్తున్నాయి.
Also Read: Watch Video: ఇదేం వింతరా బాబూ.. చెట్లు మూత్రం పోస్తున్నాయ్.. వీడియో వైరల్!
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: రామచందర్ రావు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ వేయాలంటూ రామచందర్ రావుకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి ముందు సందడి నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన మీద అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని స్పష్టం చేశారు. అందర్నీ కలుపుకొని, కలిసి కట్టుగా ఐక్యతతో ముందుకు వెళ్తానని అన్నారు. అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీ బీసీల పార్టీ అన్న ఆయన.. మన ప్రధానే బీసీ అని చెప్పుకొచ్చారు.