Chandrababu: అవును.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. అధినేత, సీఎం చంద్రబాబుకు అసహనం తెప్పించారు. ఎంతలా అంటే నిండు సభలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినంత. అటు టీడీపీ వర్గాల్లో.. ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడిదే పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏయే ప్రాంతానికి చెందిన వారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరిగింది. ఈ సభలో టీడీపీ (Telugu Desam) ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ ఈ సమావేశానికి చాలా మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ముఖ్యంగా 15 మందిపై చంద్రబాబు గరం గరం అయ్యారు. ‘ ప్రజలకు దూరంగా ఉండటమేంటి? ఆహ్వానితుల్లో 56 మంది ఎందుకు హాజరుకాలేదు?, ఈ సమావేశానికి ఉదయం ఎంత మంది వచ్చారు? సంతకాలు పెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఎంతమంది? మధ్యలో వెళ్లిపోయిన వాళ్లు ఎందరు? ఎందుకిలా చేస్తున్నారు? నాకు ఇవన్నీ తెలియదని అనుకుంటున్నారా? లేకుంటే తెలిసీ సైలెంట్‌గా ఉంటారని అనుకుంటున్నారా? అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయ్’ అని కొంత కోపం.. అంతకుమించి అసహనంతో చంద్రబాబు రగిలిపోయారు.
Read Also- Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.. మంత్రి పొన్నం
ఎవరు వాళ్లు..?
వాస్తవానికి ఎప్పట్నుంచో జనాల్లోకి వెళ్లండి.. వెళ్లండి.. ఇకనైనా పద్ధతులు మార్చుకోండని పదే పదే సీఎం చెబుతూనే వస్తున్నారు. అయినా సరే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. కనీసం జనాల్లోకి వెళ్లడానికి కూడా సాహసించకపోవడం గమనార్హం. అయితే 15 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో.. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని చంద్రబాబు భావించారు. అందుకే వారిపైన నిఘా వర్గాల నివేదికలు, ప్రజా స్పందన సర్వేల ఆధారంగా ఇలా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తున్నది. అంతేకాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదనే ఆరోపణలు, విమర్శలు వైసీపీ.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వచ్చిన సమస్యమేంటి? అనేది చంద్రబాబు నుంచి వస్తున్న ప్రశ్న. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర నుంచి నలుగురు, గోదావరి జిల్లా నుంచి ముగ్గురు, కోస్తాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలిసింది. ఈ ఎమ్మెల్యేలు ఎంతసేపూ వివాదాల్లో తలదూర్చడం, లేని వ్యవహారాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడే ఉండిపోండి!
‘ ప్రజలతో మమేకమైతేనే ఎమ్మెల్యేలకు, మన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశానికి రాలేదని అడిగితే ఎవరికి తోచినట్లుగా వాళ్లు సమాధానం చెబుతున్నారు. కొందరు విదేశీ పర్యటనలు, ఇంకొందరు దైవ దర్శనాలు అని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా? దేవాలయ సందర్శనలు మరో రోజు పెట్టుకోవచ్చు కదా? తరచూ విదేశీ పర్యటనలకు ఎందుకెళ్తున్నారు..? అలా వెళ్లేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిది. ముఖ్యంగా తానా, ఆటాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా నా దగ్గర ఉంది’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ 15 మంది ఎమ్మెల్యేలతో త్వరలోనే వ్యక్తిగతంగా చంద్రబాబు సమావేశం కానున్నట్లుగా తెలుస్తున్నది. అప్పుడిక పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆయా ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైందట. ఎందుకంటే అసలే పార్టీకి, ప్రభుత్వానికి కావాల్సినంత డ్యామేజీ వచ్చేసింది. ఇక వైసీపీ కూడా చేయాల్సిన చేసేస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా మార్పు రాకపోతే ఎలాగన్నది బహుశా చంద్రబాబు భావన అయ్యిండొచ్చు. అందుకే పనితీరు మెరుగుపరచుకోవాలని, నియోజకవర్గంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. రానున్న కాలంలో పనితీరు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా సంకేతాలు కూడా దీన్ని బట్టి గట్టిగానే ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.
Read Also- Husband Killers: చంపడానికి ఉన్న ధైర్యం.. చెప్పడానికి లేదేంటి?