Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? బాబాయ్ కోసం అబ్బాయ్ అంటూ జనసేన నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అందుకే రెండు మూడ్రోజులుగా మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా హడావుడి మొదలుపెట్టారా? అంటే తాజా పరిణామాలు బట్టి చూస్తే ఔననే అనిపిస్తున్నది. మెగా ఫ్యామిలీ నుంచి రెండు రాజకీయ పార్టీలు రాగా ప్రజారాజ్యం (Prajarajyam) పార్టీ కాంగ్రెస్‌లో (Congress) విలీనమవ్వగా.. ప్రస్తుతం జనసేన (Janasena) మాత్రమే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శాసిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కుటుంబం నుంచి నాగబాబు ఉన్నారు కానీ.. యువనేత కోసం మెగాభిమానులు, జనసైనికులు వేయి కళ్లతో వేచి చూస్తు్న్న పరిస్థితి. ఎంతైన యువత.. యువ నాయకుడ్నే కోరుకుంటారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి జనసేన, మెగాభిమానుల్లో నెలకొన్నది. ఈ క్రమంలోనే అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్నది. దీంతో ఇప్పుడు నెట్టింట్లో ఇదే చర్చ నడుస్తోంది.
రీల్ మాత్రమే.. రియల్ లేదా?
వాస్తవానికి.. రామ్ చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే దానిపై ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు. సినిమాల పరంగా పొలిటికల్ లీడర్‌గా అదేనబ్బా.. రీల్‌లో మాత్రమే కనిపించారే తప్ప ఇంతవరకూ నిజ జీవితంలో (రియల్‌గా) ఎక్కడా కనిపించలేదు. చెర్రీ తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు గతంలో మద్దతు ప్రకటించారే తప్ప ఎక్కడా పోటీ చేయలేదు. 2019 ఎన్నికల సమయంలో, పవన్ కళ్యాణ్ తరపున ఆయన ప్రచారం చేశారే కానీ, ఎక్కడా పోటీ చేయలేదు. అరంగేట్రంపై కూడా కనీసం మాట్లాడలేదు. ముఖ్యంగా.. పవన్‌కు అవసరమైనప్పుడు తమ కుటుంబ సభ్యులు అతనికి మద్దతు ఇస్తారని చెర్రీ పేర్కొన్నారు అంతే. కాగా, చెర్రీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేనే లేదు. అభిమానులు, కార్యకర్తలు హడావుడి చేస్తున్నారే తప్ప ఆయన ప్రస్తుతానికి తన సినీ కెరీర్‌పైనే దృష్టి సారించారు అంతే. ఇక ‘మేము సైతం’ వంటి కార్యక్రమాల ద్వారా తన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. డ్రగ్స్ నిర్మూలన వంటి సామాజిక అంశాలపై కూడా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మెగా హీరో ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశంపై ఎటువంటి ప్రణాళికలు ప్రకటించలేదు.
బిరుదు కూడా ఇచ్చేశారే!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యువ నాయకత్వం కావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. చిరంజీవి కుటుంబానికి ఉన్న భారీ అభిమాన బలం, ప్రజల్లో సానుకూలత ఉండటంతో చరణ్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించాలనే వాదనకు దారితీస్తున్నాయి. పవన్ తర్వాత జనసేన బాధ్యతలను రామ్ చరణ్ స్వీకరించాలని అభిమానులు, కార్యకర్తలు బలంగా కోరుతున్నారు. అయితే.. సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న తర్వాత, సరైన సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జరుగుతన్న వేళ.. అభిమానులు మాత్రం అవన్నీ ఒప్పుకోవట్లేదు. రాజకీయాల్లోకి వచ్చేయాలంతే అని చెర్రీకి ‘యువసేనాని’ అని బిరుదు కూడా ఇచ్చేశారు. ఓ వైపు పవన్.. మరోవైపు చరణ్ ఇద్దరూ సభలో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఏఐ ఫొటోలను అభిమానులు షేర్ చేస్తూ హ్యాపీగా ఫీలవుతున్నారు. జనసేనాని.. యువసేనాని అంటూ ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ జనసైనికులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ‘నా హీరో.. నా లీడర్’ అని కొందరు.. ‘ పవన్ రాజకీయ వారసుడు వస్తున్నాడహో’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘యువకుడు, ఉత్సాహవంతుడు, మన యువసేనాని. బాబాయ్, అబ్బాయ్ జై జనసేన’ అంటూ నినదిస్తున్నారు. యువసైనికుడు అని ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఫొటోలు.. స్లోగన్స్.. గట్టిగానే హడావుడి చేస్తున్నారు.
వేచి చూడాల్సిందేనబ్బా!
మెగా కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో అపారమైన ప్రజాదరణ, అభిమాన బలం ఉందన్న విషయం జగమెరిగిన సత్యమే. పవన్ కళ్యాణ్ జనసేనను బలోపేతం చేస్తున్న తరుణంలో, రామ్ చరణ్ వంటి యువ, ప్రజాదరణ పొందిన నాయకుడు పార్టీలో చేరితే అది పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అభిమానులు మరియు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా, సినీ తారలు తమ సినీ కెరీర్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించడం అరుదు. ఒకవేళ వస్తే మాత్రం.. రాజకీయాల్లో చిరంజీవి అనుభవం, దాని నుంచి నేర్చుకున్న పాఠాలు చరణ్ నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మొత్తమ్మీద చరణ్ జనసేనలోకి వస్తారని బలమైన ఊహాగానాలే తప్ప, అది కేవలం అభిమానుల ఆకాంక్షలు లేదా రాజకీయ విశ్లేషణల ఆధారంగానే ఉంది. దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక లేదా ధృవీకరించబడిన సమాచారం ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు.. రామ్ నిర్ణయాలను బట్టి ఇది మారవచ్చేమో చూద్దాం మరి.
జనసేనాని 🫰❤️🔥 ~ యువసేనాని🫰❤️🔥 pic.twitter.com/dChbkdCw0u
— FROOTY🦅 (@MOULIKA_25) June 28, 2025