TG Rain Update: సాధారణంగా వర్షాకాలం అనగానే ముందుగా రైతులే గుర్తుకు వస్తారు. పచ్చగా కలకలలాడే పంటలు చూసి వారి ముఖాలు ఎంతో విరబూస్తుంటాయి. కానీ ఈసారి రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేయడంతో ఇక వర్షాలకు తిరుగులేదని రైతులు భావించారు. అయితే నైరుతి రుతుపవనాలు ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా చెప్పుకోతగ్గ వర్షాలు పడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ వారికి పిడుగు లాంటి వార్త చెప్పింది.
వర్షాలకు బ్రేక్
తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు చాటేసిన సంగతి తెలిసిందే. అక్కడక్కడ అడపా దడపా వర్షాలు తప్పా వాగులు, వంకలు పొంగేంత స్థాయిలో ఇప్పటివరకూ వానలు పడింది లేదు. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు అంటూ ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు, నాలుగు రోజులు పెద్దగా వర్షాలు ఉండవని తేల్చి చెప్పింది. వచ్చే 3, 4 రోజులు తేలికపాటి వర్షాలు.. అది కూడా అక్కడక్కడ మాత్రమే కురుస్తాయని స్పష్టం చేసింది. కాగా జూన్ నెల ముగింపునకు వచ్చినప్పటికీ ఈ ఖరీఫ్ లో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. ఈ నెలలో దాదాపు 27 శాతం వర్షపాతం లోటు నమోదైంది. జులై 1వ తేదీ తరువాత నుంచి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రైతుల ఆందోళన
మే నెల రెండవ వారంలోనే వర్షాలు పలకరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని రైతులు.. పంటలు చదును చేసి విత్తనాలు నాటారు. మరికొంత మంది విత్తనాలు(Seeds) వేసేందుకు పొలాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. తరువాత వారం పదిరోజులపాటు వానలు లేకపోవడంతో ఆందోళన చెందుతుండగా మృగశిర కార్తె ప్రారంభంలో మళ్లీ ఆశల జల్లు కురిసింది. దీంతో భూమిని సిద్ధం చేసుకున్నవారు విత్తనాలు వేసుకున్నారు. ఇప్పటివరకూ పంటకు కావాల్సిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. ముందే వేసిన విత్తనాలు పెరగాలన్న, వచ్చిన మెులకల ప్రాణం నిలవాలన్నా వర్షాలు రావడమే పరిష్కారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Shefali Jariwala Death: బిగ్ బాస్ నటి సడెన్ డెత్.. అసలేం జరిగిందో చెప్పేసిన సెక్యూరిటీ గార్డ్!
ఆ జిల్లాలో తేలికపాటి వర్షాలు
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు తేలికపాటి వర్షాలను వాతారవరణ శాఖ సూచించింది. రేపు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, మహబూబాబాద్ వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. జూలై 1వ తేదీన కూడా ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది.