Shefali Jariwala Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (42) అకస్మాత్తుగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. షెఫాలీ (Shefali Jariwala) మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆమె అకస్మిక మరణం నేపథ్యంలో సెక్యూరిటీ గార్డ్ కీలక విషయాలు పంచుకున్నాడు. ఆమెకు గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి చనిపోయేవరకు ఏం జరిగిందో తెలియజేశాడు.
సెక్యూరిటీ గార్డ్ ఏమన్నారంటే?
షెఫాలీ జరీవాలా (42) మృతిపై సెక్యూరిటీ గార్డ్ శత్రుఘ్న.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. షెఫాలీని ఆస్పత్రికి తరలించే క్రమంలో తాను డ్యూటీలోనే ఉన్నట్లు చెప్పారు. ‘రాత్రి మేడం అస్వస్థకు గురికాగా 10:30 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించారు. దానికి ముందే రాత్రి 9 గంటలకు మేడం భర్త పరాగ్ త్యాగి.. ద్విచక్ర వాహనంపై సొసైటీకి వచ్చారు. నేనే గేటు తెరిచా. నిన్న షెఫాలి, పరాగ్ తమ కుక్కతో సొసైటీ కాంపౌండ్ లో కనిపించారు’ అని అన్నారు.
అది విని నమ్మలేకపోయా..
షెఫాలీని ఆస్పత్రికి తరలించిన వెంటనే పోలీసు బృందాలు, ఫోరెన్సిక్ యూనిట్లు తమ సొసైటీకి వచ్చినట్లు సెక్యూరిటీ గార్డ్ శత్రుఘ్న తెలిపారు. ‘నిన్న రాత్రి పోలీసులు లోపలే ఉన్నారు. తొలుత రెండు మెుబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాలు వచ్చాయి. తర్వాత ఒకటి వెళ్లిపోగా ఇంకొటి అక్కడే ఉంది. అయితే షెఫాలీని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత తెలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. ఆమె చనిపోయినట్లు అతడు తెలియజేశాడు. అది విన్నప్పుడు నేను నమ్మలేకపోయా. మేడమ్ నిన్ననే కనిపించారు. ఇప్పుడు ఆమె మాతో లేరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: S-400 Air Defence Systems: రష్యాతో భారత్ గేమ్ ఛేంజింగ్ డీల్.. ఇక పాక్, చైనాలకు చుక్కలే!
ఆ సాంగ్‌తో పాపులర్
షెఫాలీ షెఫాలీ జరీవాలా విషయానికి వస్తే ఆమె 2002 నాటి ‘కాంటా లాగా’ పాటతో ఆమె రాత్రికి రాత్రి పాపులర్ అయ్యారు. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 2004 నాటి ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలోనూ ఆమె నటించారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో పాల్గొని మరింత ఫేమ్ ను సొంతం చేసుకున్నారు. 2015లో నటుడు పరాగ్ త్యాగీని ఆమె వివాహం చేసుకున్నారు. ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాలిటీ షో 5, 7 సీజన్‌లలో భర్తతో కలిసి పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.
