- హైకోర్టులో ఐఏఎంసీకు షాక్
- కేటాయించిన భూముల రద్దు
- భవన నిర్మాణ అనుమతులు కూడా..
- కేసీఆర్ ప్రభుత్వంలో భూముల కేటాయింపు
- ఐటీ కారిడార్‌లో రూ.350 కోట్ల విలువైన భూమి
- సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇచ్చారని వాదనలు
- అన్ని జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం
IAMC: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి రాయదుర్గంలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఆ స్థలంలో భవన నిర్మాణాల కోసం జారీ చేసిన జీవోలను కూడా రద్దు చేసింది.
కేసీఆర్ హయాంలో కేటాయింపు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 నవంబర్ 26న శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో ఐఏఎంసీకి 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల కోసం అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ కారిడార్‌లో రూ.350 కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాది రఘునాథ్ రావు, వెంకటరామిరెడ్డిలు వేర్వేరుగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేశారు.
హైకోర్టులో వాదనలు
దాఖలైన పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో రఘునాథ్ రావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా 350 కోట్ల రూపాయల విలువైన భూములను ఐఏఎంసీకి కేటాయించారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఐఏఎంసీని ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి వీలు కలుగుతుందని చెప్పారు. వివాదాలు న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా పరిష్కరించుకోవచ్చని గతంలో న్యాయస్థానాలే పలు సందర్భాల్లో చెప్పాయన్నారు. ఐఏఎంసీ వల్ల వివాదాలు పరిష్కారమైతే కోర్టులపై కూడా భారం తగ్గుతుందని వాదించారు.
Read Also- Anchor: టీవీ యాంకర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
జనవరిలోనే ముగిసిన వాదనలు.. ఇప్పుడు తీర్పు
జనవరిలోనే ఈ కేసుపై వాదనలు ముగియగా తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు శుక్రవారం వెలువరించింది. ఐఏఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేసింది. ఈ స్థలంలో భవన నిర్మాణాల కోసం జారీ చేసిన జీవోలను కూడా కొట్టి వేసింది.
రాజీకి ఐఏఎంసీ రాచబాట
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉన్న సమయంలో ఈ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభమైంది. అప్పటికి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డస్ట్రిక్‌లోని వకే టవర్స్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి అప్పటి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ను ఏఐఎంసీ ప్రోత్సహిస్తుందని అన్నారు. కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోని కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసిన ఆయన, భవన నిర్మాణాల కోసం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూముల కేటాయింపునే ఇప్పుడు హైకోర్టు రద్దు చేసింది.
Read Also- SJ Suryah: పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా.. ఏయ్ సుధా విన్నావా?