Tirumala Gaming App: దేశంలోని సుప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల ఒకటి. అక్కడి శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకొని పావనమవుతుంటారు. అటువంటి పవిత్రమైన తిరుమల ఆలయం.. గత కొంతకాలంగా వివాదాలకు వేదికగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో వివాదంతో తిరుమల వార్తల్లో నిలిచింది. తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఓ గేమింగ్ యాప్ రూపొందటం కలకలం సృష్టిస్తోంది.
అసలేం జరిగిదంటే?
తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో తమిళనాడుకు చెందిన రోబ్లక్స్ సంస్థ (Roblox Company).. ఓ గేమింగ్ యాప్ ను రూపొందించింది. అందులో తిరుపతి నుండి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలను (గ్రాఫిక్స్) పొందుపరిచింది. ఈ యాప్ ద్వారా రోబ్లక్స్ సంస్థ గణనీయంగా లాభాలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరుమల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని.. గేమ్ డిజైన్ చేయడంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)కు ఫిర్యాదు చేశారు. తిరుమల మీద గేమ్ డిజైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ ను కిరణ్ రాయల్ (Kiran Royal) కోరారు.
టీటీడీ ఛైర్మన్ రియాక్షన్!
తిరుమల ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేయడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను అదేశించారు. దైవ భక్తిని ఆసరాగా చేసుకొని డాలర్స్ రూపంలో ఆన్ లైన్ లో వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలో రోబ్లక్స్ సంస్థకు టీటీడీ విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Lakshmi Narasimha Swamy Temple: మహిమాన్విత క్షేత్రం.. హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం!
శ్రీవారి లడ్డు పంపిణీలో కొత్త విధానం
తిరుమల శ్రీవారి లడ్డును భక్తులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వామి వారి దర్శనం అనంతరం.. లడ్డు తీసుకునేందుకు క్యూలైన్లలో గంటలకొద్ది పడిగాపులు కాస్తుంటారు. అయితే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డులను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ జరిగేలా ఈ యంత్రాలు తోడ్పాటు అందించనున్నాయి. యూపీఐ చెల్లింపుల ద్వారా పారదర్శక లావాదేవీలకు అవకాశం కల్పించినట్లు టీటీడీ తెలిపింది.