Pawan Kalyan: అవును.. ‘ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పెద్దలు, సోదరులు పవన్ కళ్యాణ్ గారికి’ అంటూ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) సంబోదించారు. గురువారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పురందేశ్వరి ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుండగా పొరపాటున అలా వచ్చేసింది. అయితే నిజంగానే తడబడి మాట్లాడారా? లేకుంటే మనసులో మాట చెప్పారా? అంటూ పెద్ద ప్రశ్నే ఎదురువుతోంది. ఈ మాటలతో సభలో ఉన్న జనసేన అభిమానులు ఒక్కసారిగా కేకలు, ఈలలతో హోరెత్తించారు. అయితే ఈ క్రమంలోనే తన పొరపాటును గ్రహించిన పురందేశ్వరి వెంటనే ‘డిప్యూటీ సీఎం’ అని తన తప్పును సరిదిద్దుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ చిన్న తడబాటు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా చర్చ జరుగుతోంది.
అంటే అన్నారు కానీ..!
సోషల్ మీడియాలో ఏ రేంజిలో చర్చ జరుగుతోందటే జనసైనికులు, మెగాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ‘ మేడమ్ గారు అంటే అన్నారు కానీ.. ఆ ఊహ ఎంత బాగుందో’ అంటూ కమెడియన్ బ్రహ్మానందం మీమ్స్‌తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అవునబ్బా.. 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ సీఎం (CM Pawan Kalyan) అవుతాడు.. అందులో నో డౌట్’ అని మరికొందరు వీరాభిమానులు చెబుతున్న అభిప్రాయ పడుతున్న పరిస్థితి. పవన్ సీఎం అయితే.. చంద్రబాబు సంగతేంటి? ఆయన్ను ఏం చేయాలని అనుకుంటున్నారు.. అనే ప్రశ్నలూ సంధిస్తున్నారు. ‘ సొంత బావను ఎలా మరిచిపోయారమ్మా.. కొంపదీసి విబేధాలు ఏమైనా వచ్చాయా?’ అని సెటైర్లు వేస్తున్న జనాలూ ఉన్నారు. ఈ మాటల వెనుక బీజేపీ మనోగతం దాగి ఉందని మరొక వర్గం విశ్లేషిస్తోంది. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఇప్పుడిదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బహుశా సాయంత్రానికల్లా పురందేశ్వరి మరోసారి రియాక్ట్ అయ్యి.. వివరణ ఇచ్చుకున్నా ఇవ్వొచ్చేమో..!
ఏమిటా కార్యక్రమం..!
కూటమి ప్రభుత్వం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో ‘అఖండ గోదావరి ప్రాజెక్టు’ (Akhanda Godavari Project) నిర్వహిస్తోంది. ఈ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో ఇకపై రాజమండ్రిలో పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో భాగంగా.. రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల పాత రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్నది. ముఖ్యంగా.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
@PurandeswariBJP గారు.. చూసుకోవాలి కదమ్మా.. 🤗🤗
అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బాగుందో అని… ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో జన సైనికులు..! pic.twitter.com/8m34x7yImH
— Nagarjuna (@pusapatinag) June 26, 2025