Maoists Party Letter: తెలంగాణ మంత్రి సీతక్కను ప్రశ్నిస్తూ మవోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆదివాసుల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ బాధ్యత మంత్రి సీతక్కదేనని తేల్చి చెప్పారు. ఆదివాసీ రైతులకు భరోసా కల్పించాలన్న మావోయిస్టులు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49ను రద్దు చేయాలని లేఖ డిమాండ్ చేశారు.
అడవికి దూరం చేసే కుట్ర
సీఎం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 49.. జంతు పులుల కోసమా? మానవ పులుల కోసమా..? అంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల అయింది. కొమురం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలో సుమారు 339 గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో జంతు పులుల కోసం కాదు.. అంబానీ.. ఆదాని లాంటి కార్పోరేట్ సంస్థల కోసమే అంటూ లేఖలో పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా అడవితో.. అడవి జంతువులతో సహజీవనం చేస్తున్న మూల ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల జీవనాన్ని.. సంస్కృతి సంప్రదాయాలను అటవీ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని లేఖలో ఆరోపించారు.
ఆ 4 జిల్లాలు కనుమరుగు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో మూడు జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయని మావోయిస్టులు.. లేఖలో పేర్కొన్నారు. కొమురం భీం.. ములుగు.. భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో కనపడవని పేర్కొన్నారు. అడవిలో సంపదకు, భూభాగానికి హక్కుదారులు మూల ఆదివాసీలే అని రాజ్యాంగం చెబుతుందని లేఖలో పేర్కొన్నారు. గతంలో కిల్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేసిన పాలకులు వారిని రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు.
Also Read: Rangareddy District: సినిమా రేంజ్‌లో పట్టాలపై కారు నడిపిన యువతి.. తప్పిన పెను ముప్పు!
సీతక్కకు సిగ్గుచేటు!
తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి ఆదివాసులకు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసి రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని పట్టుబట్టారు. ఆదివాసి సంఘాలతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేఖలో కోరారు. దివాసి బిడ్డ మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం సిగ్గుచేటు, అవమానకరమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడటం లేదని లేఖలో నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.