Rahul Gandhi: గుజరాతీలైన నరేంద్ర మోదీ, అంబానీ, అదానీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీ ప్రధానమంత్రి అయ్యాక వారిద్దరికి చాలా విధాలుగా లబ్ది చేకూర్చారని ప్రతిపక్ష నేతలు తరుచూ ఆరోపణలు చేస్తుంటాయి. టెండర్‌లలో, పన్ను మినహాయింపుల్లో, రుణ మాఫీల్లో మోదీ బడా పారిశ్రామికవేత్తల వైపే ఉంటారని కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటుంది. రాఫేల్ యుద్ధ విమానాల డీలింగ్ విషయమై రాహుల్ గాంధీ మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం ఈ పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలను కంటిన్యూ చేశారు. ఎన్నికల్లోనూ మోదీకి వీరి మద్దతు ఉంటుందని చెబుతుంటారు. అందుకే సుడిగాలి పర్యటనలకు ఓ సారి ఈ ఇండస్ట్రియలిస్ట్ ఫ్లైట్ ఉపయోగించారనీ కథనాలు వచ్చాయి. ఇంత దగ్గరి సంబంధాలు ఉండే వీరిపై నరేంద్ర మోదీ ఇది వరకు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ, తొలిసారిగా, అదీ తెలంగాణ గడ్డ మీద వీరిపై ఆరోపణలు చేశారు. దీంతో మోదీ వ్యవహారంలో ఈ అనూహ్య మార్పేమిటా? అని సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. కాంగ్రెస్ కూడా మోదీకి గట్టి కౌంటర్ ఇచ్చింది.
This video is the best of this decade. PM Modi ji is saying that Ambani and Adani are having black money. Superb!🤪😁😁😁 pic.twitter.com/sFYbyUC174
— KRK (@kamaalrkhan) May 8, 2024
బుధవారం ఉదయం వేములవాడలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పై విమర్శలు చేసే క్రమంలో ఆయన తన స్నేహితులైన గౌతమ్ అదానీ, అంబానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు కొన్ని సంవత్సరాలుగా అంబానీ, అదానీ అనే జపాన్ని నేర్చుకుందని, ఎప్పుడూ ఇదే జపాన్ని పఠించేదని మోదీ అన్నారు. కానీ, అనూహ్యంగా ఈ ఎన్నికలు మొదలవ్వగానే వారు అంబానీ, అదానీల ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాక ఇప్పుడు ఎందుకు వీరిపై ఆరోపణలు చేయడం లేదని ప్రశ్నించారు. వారి నుంచి ఎన్ని డబ్బులు పొందారని అడిగారు. నల్లధనం పెట్టెల్లో ఎంతమొత్తంలో అందింది? అని ప్రశ్నించారు. టెంపోల్లో నోట్ల కట్టలు కాంగ్రెస్ గూటికి చేరాయా? అని అడిగారు. అసలు ఏం డీలింగ్ జరిగింది?.. రాత్రికి రాత్రే అంబానీ, అదానీల గురించి మాట్లాడటం లేదని అనుమానించారు. ఇందులో ఏదో గూడుపుఠాణీ ఉన్నదని శంకించారు.
Also Read: Covishield: కొవిడ్ టీకాను ఆస్ట్రాజెనెకా ఎందుకు ఉపసంహరించుకుంది?
ఇందుకు సంబంధించి మోదీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. మోదీ తన మిత్రులపైనే దాడి చేస్తున్నారా? తన మిత్రుల వద్ద నల్లధనం ఉన్నదని చెబుతున్నారా? లేక కాంగ్రెస్ పై దాడి చేయబోయి మిత్రులను ఇరకాటంలో వేసేశారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మోదీ తన మిత్రులపట్ల స్వరాన్ని మార్చారని, ఇది ఎన్నికల ఫండింగ్‌కు సంబంధించి ఒక చీకటి కోణాన్ని వెలికితీయనుందా? అని ట్వీట్ చేశారు. మోదీ ప్రకారం అంబానీ, అదానీల వద్ద భారీగా నల్లధనం ఉన్నదని, ఆ నల్లధనం పట్టుకోవడానికి ఆయన ప్రభుత్వం ఈడీ, సీబీఐలను పంపలేదని చెబుతున్నారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
మిత్రులు ఇప్పుడు మిత్రులు కాదు!
మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ కాలం మారిపోయింది. ‘మిత్రులు ఇప్పుడు మిత్రులు కాదు. మూడు విడతల ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ తన మిత్రులపైనే దాడికి దిగారు. మోదీ కుర్చీ వణికిపోతున్నదని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నదని ట్వీట్ చేశారు. ఇదే నేటి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నది’ అని ఖర్గే కామెంట్ చేశారు.
అది కాదు.. ఇదీ వాస్తవం
‘రాహుల్ గాంధీ అదానీ పేరు తీసుకోవడం లేదని ప్రధాని మోదీ ఈ రోజు అన్నారు. కానీ, అదానీ గురించి రాహుల్ గాంధీ ప్రతి రోజు ప్రజల ముందు మాట్లాడుతారు. ఆయన విధానాలను తూర్పారబడుతారు. మోదీకి బడా పారిశ్రామికవేత్తలకు లోపాయికారి సంబంధం ఉన్నదని రాహుల్ గాంధీ ప్రజలకు చెబుతారు. మోదీ తన మిత్రులు చేసిన రూ. 16 లక్షల కోట్లను రుణ మాఫీ చేశారు, కానీ, పేద రైతుల రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.