– శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో ప్రైవేట్ హైడ్రో పవర్ కుట్రలు!
– ఏటా పెన్నా బేషన్‌కు తరలి వెళ్తున్న 200 టీఏంసీలు?
– రైతులకు పనికి రాకుండానే సముద్రం పాలు
– కొత్తగా గ్రీన్ కో 1000 మెగా వాట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్
– నవంబర్ రాక ముందే నీటి తగ్గుదలపై అధ్యయనం
– కాలువలు వెడల్పు చేసి దోచుకెళ్తున్న వైనం
– గ్రీన్ కో గ్రీన్ ఎనర్జీకి తెలంగాణ నుంచి సపోర్ట్
– బనకచర్ల వ్యవహారంతో బయటపడుతున్న ప్రైవేట్ దోపిడీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Banakacherla: రాష్ట్ర విభజన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతున్నది. ఒకసారి కృష్ణా జలాల వివాదం, ఇంకోసారి గోదావరి పంచాయితీ. ఇలా గత 11 ఏళ్లలో జల జగడం పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఏపీ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు బనకచర్ల పేరుతో కొత్త వివాదానికి కారణమైంది. అయితే, దీని వెనుక డైవర్షన్ ప్లాన్ ఉన్నదన్న చర్చ జరుగుతున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంశంలో ప్రైవేట్ హైడ్రో పవర్ దోపిడీని ప్రశ్నించకుండా ఉండేందుకే సాధ్యం కాని బనకచర్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.
ఇష్టారీతిన నీటి తరలింపు
హైడ్రో పవర్ ఏర్పాటు కోసం 1975లో శ్రీశైలం డ్యాం నిర్మించారు. తెలంగాణకు 900 మెగా వాట్ల తయారీకి భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 మెగా వాట్ల తయారీకి ఏపీ వాడుకుంటున్నది. ఎస్ఎల్బీసీ నుంచి టన్నెల్ ద్వారా తెలంగాణ మరింత వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నా దశాబ్దాలుగా ఆ కల నెరవేరడం లేదు. తిరిగి దిగువకు నీటిని వదులుకోవాల్సి వస్తున్నది. అయితే, బ్యాక్ వాటర్ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో మద్రాస్‌కు తాగునీరు పేరుతో తెలుగు గంగ ప్రతిపాదన చేసి కాలువలు తవ్వించారు. రాయలసీమను కాదని తీసుకెళ్లడంపై పెద్ద ఉద్యమాలే జరిగాయి. పొతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి డ్రా చేసుకునేందుకు నీళ్లను 10 మీటర్ల ఎత్తులోనే హెడ్ రెగ్యులేటర్ రైట్ కెనాల్ ద్వారా తీసుకెళ్లుతున్నారు. క్రాస్ రెగ్యులేటర్‌తో బ్రిటిష్ కాలంలో నిర్మించిన కేసీ కెనాల్‌కు కలిపారు. వద్దన్నా కూడా నీళ్లు దిగువకు వెళ్లేలా తవ్వకాలు జరిపిన కాలువలతో పెద్ద ఎత్తున దొపిడీ జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు గంగ 20 మీటర్లు ఉండగా కేసీ కెనాల్ 80 మీటర్లుకు పెంచారు. గోరకల్లు రిజర్వాయిర్ కెనాల్ 53 మీటర్లు తవ్వారు. 2003లో 2 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేది. ఇప్పుడు 4 టీఏంసీలకు పెంచుకున్నారు.
గ్రీన్ కోతో పాటు 34 హైడ్రో పవర్ ప్రాజెక్టులు
వరదలు భారీగా వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ కళకళలాడుతుంది. అయితే, నవంబర్ వచ్చే సరికే బ్యాక్ వాటర్ పేరుతో మిగులు జలాలు అంటూ ఇబ్బడిముబ్బడిగా నీటిని దొచుకెళ్తున్నారు. గోరకల్లు నుంచి పెన్నానది పైన ఉన్న గండికోట ప్రాజెక్ట్‌కు కనెక్ట్ చేశారు. 2014లోనే తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో 16 మినీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మించారు. రైట్ సైడ్ కెనాల్ పైన 18 ప్రైవేట్ హైడ్రో పవర్స్ ఉన్నాయి. ఇవి ఉపయోగించే నీళ్లు లెక్కలోకి లేకుండానే దిగువకు వదులుతున్నారు. ఈ నీళ్లంతా రైతులకు ఉపయోగం లేకుండానే గుండ్లకమ్మ ద్వారా పాలేరు నుంచి వాగులు వంకల ద్వారా బే ఆఫ్ బెంగాల్‌లో కలిసి పొతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గ్రీన్ కో కంపెనీ పిన్నాపురం వద్ద 5 వేల ఎకరాల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్‌ను తయారు చేస్తున్నది. దీనికి తోడుగా గోరకల్లు పైన 11 కిలోమీటర్ల దూరంలో ఎత్తి పోసేందుకు 3 టీఎంసీల కెపాసీటీ కలిగిన రిజర్వాయిర్లను నిర్మించింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల పేరుతో 1200 మెగా వాట్ల తయారీకి ఏర్పాటు చేస్తున్నది. అయితే, ఈ విద్యుత్ తయారీకి 10 నుంచి 15 టీఏంసీల రిజర్వాయిర్ అవసరమని తెలుస్తున్నది. దీంతో లీకేజీల రూపంలో రోజుకు 10 నుంచి 15 మిలియన్ల లీటర్లు (10 వేల క్యూబిక్ మీటర్ల నీరు) కిందికి వదలాల్సి ఉంటుంది.
Read Also- Chevireddy: చెవిరెడ్డికి ఏమైంది.. వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు?
నీటి దుర్వినియోగంపై చర్యలేవి?
రైతులు పంట సాగు కోసం కెనాల్ వాటర్‌ను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగాన కాలువల ద్వారా అక్రమంగా వినియోగించుకుంటున్న నీటిపై చర్యలు లేవు. ప్రైవేట్ వ్యక్తులు హైడ్రో పవర్ పేరుతో దొచుకెళ్తున్న నీటికి లెక్కలు లేవు, అనుమతులు లేవు. కానీ, గ్రీన్ కో లాంటి సంస్ధలు ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలను, అటు ఏపీ ప్రభుత్వంలో ఉండే రాజకీయ పార్టీలను మేనేజ్ చేసి పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నది. దీంతో పాటు అనేక ప్రైవేట్ మినీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్‌కు శ్రీశైలం నీటిని వాడుకునే హక్కు లేదు. కరువు జిల్లాలైన రాయలసీమ జిల్లాల పేరు చెప్పుకుని దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. టెలీ మీటర్లు పెడతామని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, నీళ్లను వాడుకున్న తర్వాత ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నలను ఎదుర్కొంటున్నది. రైతులపై క్రిమినల్ కేసులు పెట్టే ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యక్తులు పవర్ అమ్ముకుంటుంటే ఎందుకు సహకరిస్తున్నారనది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అక్రమంగా ఇలాంటి సంస్థలకు ఇవ్వాలని బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో కానీ, బ్రిజేష్ ఒప్పందంలో కానీ చెప్పలేదు.
కాలువలతో ఖతం చేస్తున్నారు
శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద మూడు రెగ్యులేటర్లతో కూడిన సిస్టమ్ ద్వారా 50 కిలోమీటర్ల దూరంలో గోరకల్లు బాలెన్సింగ్ జలాశయానికి నీరు చేరుతాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెనాల్ నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద నీటిని ఎక్కువగా తీసుకెళ్తున్నారనేది తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు దీనిపై ఫిర్యాదులు అందినా పరిష్కార మార్గాలు దొరకడం లేదు. వాటా కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్లడంతో వివాదం ముదురుతుంది. ఈ విషయాలపై పై స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే డైవర్షన్ కోసమే ఏపీ ప్రభుత్వం గోదావరి నది నుంచి కృష్ణా నదిపై ఉన్న బనకచర్లకు లింక్ పెట్టే ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చిందని అనుకుంటున్నారు.
Read Also- Viral News: కోడలు పారిపోయిందన్నారు.. దర్యాప్తులో సంచలనం!