Chevireddy: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Chevireddy Bhaskar Reddy) అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం జైల్లో సడన్‌గా అస్వస్థతకు లోనయ్యారు. విషయం జైలు అధికారులకు చెప్పడంతో అప్రమత్తమై జైల్లో ఉన్న వైద్యులతో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో దాదాపు రెండు గంటల పాటు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఇవాళ సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని తెలిసింది. వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టు వచ్చాక దాన్నిబట్టి తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ (YSR Congress) పెద్దలు.. కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెవిరెడ్డి ఆరోగ్యంపై హైకమాండ్ ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడ జైల్లో ఉన్న చెవిరెడ్డిని పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. వైసీపీలో కీలకంగా ఉన్న నేత కావడం.. అధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆపద సమయంలో ఉన్న భాస్కర్ రెడ్డిని పరామర్శించే ఛాన్స్ ఉన్నది.
Read Also- Kuberaa OTT: ‘కుబేర’ ఓటీటీ డీల్ ఎంతో తెలుసా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
విడుదల కోరుతూ..
ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసుకు చెవిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని.. ఇదంతా అక్రమ అరెస్టు అని అభిమానులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. భాస్కర్ రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ శనివారం తిరుపతిలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చెవిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి, గోవింద నామ స్మరణలతో ఏడుకొండల వెంకన్నను చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని.. చెవిరెడ్డి ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. జైల్లో తనకు వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బయటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. సోమవారం నాడు చెవిరెడ్డి విజ్ఞప్తిపై ధర్మాసనం విచారణ జరపనుంది.
అరెస్ట్ ఎందుకు?
కాగా, చెవిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చెవిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చెవిరెడ్డి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద ఆయన్ను అడ్డుకుని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. భాస్కర్ రెడ్డిని ఏ-38 నిందితుడిగా సిట్ పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 9 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో చెవిరెడ్డి గన్‌మెన్ మదన్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. చెవిరెడ్డి అరెస్టును ‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య’ అని వైసీపీ ఆరోపిస్తున్నది. మరోవైపు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
Read Also- Aamir Khan – Gauri Spratt: అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!