Telangana Government Power Bills Clarity : తెలంగాణలో ఎవరికైనా 200 యూనిట్ల లోపు ఉండి కరెంట్ బిల్లు వస్తే కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గృహ జ్యోతి పథకం అమలు చేసినప్పటి నుంచి 200 యూనిట్ల లోపు ఉన్నవారికి జీరో బిల్లు వస్తుందని, కొందరికి బిల్లు వస్తుందని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇలా బిల్లులో 200 యూనిట్లలోపు ఉన్న వారికి బిల్లు వస్తే వారు ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులో పొరపాటుగా నమోదు చేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని, ఆ బిల్లుతో పాటు రేషన్ కార్డు తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ నందు నమోదు చేయించుకుంటే జోరో బిల్లు వస్తుందని తెలియజేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. 200లోపు యూనిట్ల విద్యుత్ వాడకందారులకు జీరో బిల్లులు జారీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40, 33, 702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేసింది. రేషన్ కార్డు, ఆధార్ నంబర్, కరెంట్ కనెక్ష వివరాలు సక్రమంగా ఉన్నవారికి ఇప్పటికే జీరో బిల్లులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. అయితే కొంతమంది విద్యుత్ వినియోగదారులు 200లోపే కరెంట్ వాడుకున్నా.. ప్రభుత్వం కోరిన వివరాలు సమర్పించకపోవడంతో వారికి జీరో బిల్లులు జారీ కాలేదు. అలాంటి వారిని లబ్ధిదారుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 లోపు యూనిట్ల కరెంట్ వాడుకున్న వారికి సాధారణ బిల్లు జారీ అయినా అది చెల్లంచనవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. వారు మండల పరిషత్ , మున్సిపల్, విద్యుత్ , రెవెన్యూ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు, ఆధార్ నంబర్, విద్యుత్ కనెక్షన్ వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలని సూచించారు. అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లు జారీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే 45 వేల మంది రివైజ్డ్ బిల్లులు ఇచ్చామని వెల్లడించారు.