kcr son stroke ktr
Politics

Hyderabad: గులాబీ బాస్‌కి ‘సన్’స్ట్రోక్

  • విపక్షంలో కూర్చున్నా.. తీరు మార్చుకోని కేటీఆర్
  • పార్టీ క్యాడర్‌లో భగ్గుమంటున్న అసంతృప్తి
  • అసెంబ్లీ ఓటమిపై నేటికీ జరగని సమీక్ష
  • నేతలకే దక్కని కార్యనిర్వాహకుడి దర్శనం
  • వలసలను ఆపటం పట్ల అనాసక్తి
  • ఎంపీ ఎన్నికల్లో అహంకారపూరిత వ్యాఖ్యలు
  • పుత్ర వాత్సల్యంతో పట్టించుకోని కేసీఆర్
  • ఇలాగైతే కష్టమంటున్న గులాబీ శ్రేణులు

BRS cadre not satisfied with KTR..not giving preference :గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ ఒకటి తలిస్తే.. తెలంగాణా సమాజం మరొక తీరున తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికున్న కారణాల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేసీఆర్ తనయుడు కేటీఆర్ వైఖరేనని ఈ లోక్‌సభ ఎన్నికల వేళ గులాబీ శ్రేణులు మరోసారి గుర్తుచేసుకుంటున్నాయి.

సీనియర్ నేతల నారాజ్..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాలవారీగా రివ్యూ మీటింగులు పెట్టి, సమస్యలను గుర్తించి, పనిచేయని నేతల స్థానంలో కమిటీలైనా వేస్తారని అక్కడి నేతలు ఆశించారు. ఎన్నికల్లో పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని వారు ఆశించారు. కానీ, కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌లో ఒక్క ప్రెస్ మీట్‌ పెట్టి మమ అనిపించారు. కనీసం తమ నియోజక వర్గపు పరిస్థితిని చెప్పుకుందామని ఆశించిన నేతలకు ఆయన ఆపాయింట్‌మెంట్ కూడా దక్కకపోవటంతో అక్కడ కొనసాగలేక నేతలు వలస బాట పట్టారు. కనీసం వలసల గురించి వార్తలు విన్న తర్వాతైనా కేటీఆర్ స్పందించకపోవటంతో వారు వేరే పార్టీల్లో చేరటమే గాక ఆ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలను ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకి పారేస్తున్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయని తెలిసినా, సన్నాహక సమావేశాలంటూ కాస్త హడావుడి చేశారనీ, వాటికీ తన వర్గం అనుకున్న వారికే తప్ప అందరినీ పిలవలేదని, ఈ సమావేశాల్లోనూ తాను మాట్లాడటమే తప్ప, నేతలకెవరికీ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశమే రాలేదని సీనియర్లు బాధపడుతున్నారు. ఓడిన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్ష చేసి, ఎంపీ ఎన్నికలకు కమిటీలు వేద్దామని సూచించినా పట్టించుకోలేదని, ఇక తమ పెద్దరికం దేనికని వారు వాపోతున్నారు.

దర్శనం కరువు

మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇంతకాలం బిజీగా ఉన్నా.. తామూ బాధ పడలేదని, కానీ, క్షేత్ర స్థాయిలో ప్రత్యర్థులతో పోరాడే క్రమంలో నష్టపోయిన తమను కనీసం పలకరించే సమయం కూడా యువనేతకు లేకుండా పోయిందని, గతంలో ఆయన పర్యటనకు వస్తే అన్నీ తామై వ్యవహరించిన నేతలు మండిపడుతున్నారు. పదేళ్లు పగలూ రాత్రీ తేడా లేకుండా పనిచేసిన తమకే రోజుల తరబడి అపాయింట్‌మెంట్ దక్కకపోతే, ఇక పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం ఎలా ఉంటుందని వారు వాపోతున్నారు.

ఈ మౌనమే శాపం..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పర్యటనలు చేస్తూ, పాత కార్యకర్తలు, నేతలను పరామర్శిస్తే వారికి ధైర్యంగా ఉంటుందని, అదే సమయంలో ప్రత్యర్థులు, ప్రజా సమస్యల మీదా స్పందించటం ద్వారా తిరిగి ఒక జోష్ తీసుకురావచ్చని పార్టీ జిల్లా నేతలు కోరుతున్నారు. కానీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రం స్పందించటం లేదు. మరోవైపు పార్టీ వీడిన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే, కార్యనిర్వాహక అధ్యక్షుడు మౌనంగా ఉండటం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందని, ఇక తాము ఏ మొహం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయగలమని వారు వాపోతున్నారు. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటేననే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ మౌనం దేనికి సంకేతమని ఆ పార్టీ మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రియలైజ్ కాలే…

ఓటమి తర్వాత జిల్లా పర్యటనలు చేసి, కేడర్‌ను ఉత్సాహ పరచటం మరచిపోయి, తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ఎవరని అధినాయకత్వం వెతకటం వెనక పార్టీని నడిపే విషయంలో వారికున్న నిబద్ధత ఏమిటో అర్థమవుతోందని ఆ పార్టీలో చిరకాలంగా పనిచేసి, బయటికొచ్చిన నేతలు చెబుతున్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తామని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆయన చెప్పిన మాటలు.. రియలైజ్ అయినట్లుగా కనిపిస్తున్నా అది ‘రియల్’ కాదనే జనరల్ కామెంట్లు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

కలవడు..కలవనియ్యడు

పార్టీ పరిస్థితి, కేడర్ కష్టాలు చెప్పుకుందామంటే దొరకని కేటీఆర్, ఎవరైనా నేతలు కేసీఆర్‌ను కలవటానికి వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నాడనే మాట కూడా కొందరు సీనియర్లు చెబుతున్నారు. మొదటి నుంచి తాము ఏ సమస్య అయినా గులాబీ బాస్‌తో చర్చించే వారమనీ, కేటీఆర్ కారణంగా తమకు ఇప్పడు ఆ ఛానల్ కూడా బంద్ అయిందని వారు వాపోతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంలో పనిచేసి బలమైన కేడర్ కారణంగా తాము పలుమార్లు ఎన్నికల్లో గెలిచామని, తమ అనుభవాన్ని లెక్కచేయకుండా, తమ నియోజక వర్గాల్లోని యువనేతలతోనే కేటీఆర్ ముచ్చటించి పోతున్నాడని మరికొందరి సీనియర్లు మథన పడుతున్నారు.

నోరు విప్పని కేసీఆర్ 

తమ సమస్యల గురించి, పార్టీ కార్యక్రమాల గురించి కేడర్.. గులాబీ బాస్‌కు అనేక సార్లు కబురు పెడుతున్నా.. అటు నుంచి తిరుగు జవాబు రావటం లేదు. కేసీఆర్ తిరిగి యాక్టివ్‌గా జనంలోకి వచ్చినా, పుత్ర వాత్సల్యంతో వీటన్నింటినీ లైట్ తీసుకుంటున్నారని, ఇలాగైతే కవిత అరెస్టుతో డ్యామేజ్ అయిన పార్టీ ఇమేజ్ బలపడేది ఎలా అని వారు లోలోన గొణుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండు వేసవిలో వచ్చిన ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో గులాబీ బాస్‌కి సన్ స్ట్రోక్ తప్పదని వారు భావిస్తున్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?